Optical Disc | బీజింగ్, నవంబర్ 29: సీడీ, డీవీడీ, బ్లూ-రే డిస్క్, హార్డ్ డిస్క్ వంటి ఎన్నో పరికరాల్లో డాటాను నిక్షిప్తం చేస్తే అది ఎన్నేండ్లు ఉంటుందో చెప్పలేం. ఈ సమస్యకు చైనా పరిశోధకులు సరికొత్త పరిష్కారాన్ని కనుగొన్నారు. లక్షల ఏండ్ల పాటు సమాచారాన్ని సురక్షితంగా స్టోర్ చేసేలా.. వజ్రాల ద్వారా డైమండ్ ఆప్టికల్ డిస్క్‌ను అభివృద్ధి చేశారు.
చైనాలోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ ఆండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు ఈ కొత్త డివైజ్‌ను రూపొందించి, విజయవంతంగా పరీక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ‘న్యూ సైంటిస్ట్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. సాధారణ బ్లూ-రే డిస్క్ సైజులోనే ఉండే ఈ డైమండ్ డిస్క్‌లో వంద టెరాబైట్ల డాటాను నిక్షిప్తం చేయవచ్చని, డిస్క్‌లోని ఒక్క క్యూబిక్ సెంటీమీటర్పై 1.85 టీబీ డాటాను స్టోర్ చేయొచ్చని చెప్తున్నారు.
బ్లూ-రే డిస్క్ స్టోరేజ్ సామర్థ్యంతో పోలిస్తే ఇది దాదాపు 2 వేల రెట్లు అధికం. బ్లూ-రే డిస్క్‌లలో కొన్ని దశాబ్దాల పాటు డాటాను నిల్వ చేయవచ్చని, డైమండ్ డిస్క్‌లలో మాత్రం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్ల అవసరం లేకుండా, గది ఉష్ణోగ్రతలో లక్షల ఏండ్ల పాటు డాటాను పదిలంగా ఉంచొచ్చని పరిశోధకుల్లో ఒకరైన యా వాంగ్ తెలిపారు.