Pak terrorist : పాకిస్థాన్ (Pakistan) ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ (Abdul Rauf) మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీని పెళ్లిపిల్లను చేస్తామని అన్నాడు. ఢిల్లీని ఆక్రమిస్తాం అనే అర్థం వచ్చేలా ఈ వ్యాఖ్య చేశాడు. అదేవిధంగా భారత వైమానిక దళం (Indian Airforce) పై కూడా ఆ ఉగ్రవాది నోరుపారేసుకున్నాడు.
లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు అబ్దుల్ రవూఫ్ అత్యంత సన్నిహితుడు. పాకిస్థాన్ ఆర్మీ అతడిని గతంలో సాధారణ పౌరుడిగా, అమాయకుడిగా పేర్కొన్నది. అయితే ఇప్పుడు భారత్‌పై దాడులకు బహిరంగంగా పిలుపునిస్తూ చేసిన వ్యాఖ్యల్లో అతడిలోని ఉగ్ర భావజాలం స్పష్టమవుతున్నది. తాజాగా అతడు మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో పోరాటం సమసిపోయిందనే వాదనలను కొట్టిపారేశాడు.
జమ్ముకశ్మీర్‌లో పోరాటం ముగియలేదని, వివాదం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించాడు. ఎల్ఐటీ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ రెహమాన్ మక్కీని ఉద్దేశిస్తూ.. భారత రాజధానిని స్వాధీనం చేసుకోవడమే తమ గ్రూపు లక్ష్యమన్నాడు. ఈ సందర్భంగా ఢిల్లీని ఆక్రమిస్తామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశాడు. భారత సైనిక శక్తిపై కూడా రవూఫ్ నోరుపారేసుకున్నాడు. భారత్‌కు చెందిన రఫేల్ యుద్ధవిమానాలు, ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్లు అసమర్థమైనవిగా వ్యాఖ్యానించాడు.
భారత వైమానిక దళం పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించే ధైర్యం చేయదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. ఇస్లామిక్ దేశాల్లో పాకిస్థాన్ వద్ద మాత్రమే అసలైన అణ్వాయుధాలు ఉన్నాయన్నాడు.