రియో: బ్రెజిల్లో కరోనా సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. ఆ దేశంలో పలు నగరాల్లో గత కొన్ని నెలల నుంచి జననాల కన్నా మరణాల సంఖ్యే ఎక్కువ స్థాయిలో నమోదు అవుతున్నది. రియో డి జానరో నగరంలో గత ఆరు నెలల నుంచి ఇదే సీన్ రిపీట్ అవుతున్నది. రియోలో మార్చిలో 36,437 మంది మరణించారు. ఇక ఆ నగరంలో ఆ నెలలో పుట్టిన వారి సంఖ్య 32,060గా ఉంది. అంటే ఒక నెలలో జననాల కన్నా ఆ రాష్ట్రంలో మరణాల సంఖ్య 16 శాతం ఎక్కువగా ఉంది. జాతీయ సివిల్ రిజిస్టర్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఒక్క రియో నగరమే కాదు.. ఆ దేశంలో మరో పది నగరాల్లోనూ ఇదే తరహా మార్పు కనిపిస్తున్నది. అయిదు లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో తక్కువ సంఖ్యలోనే జననాలు నమోదు అవుతున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. బ్రెజిల్‌లోని పీ 1 వేరియంట్ అక్కడ బీభత్సం సృష్టిస్తున్నది. ఆ కొత్త స్ట్రెయిన్ వల్లే ఆ దేశంలో కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ ప్రకారం బ్రెజిల్లో ఇప్పటి వరకు 77,515 మంది కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. 20 లక్షల మంది పాజిటివ్‌గా తేలారు. 27 రాష్ట్రాల్లో దాదాపు 80 శాతం హాస్పిటళ్లు రోగులతో నిండి ఉన్నాయి.