Death Clock | వాషింగ్టన్, డిసెంబర్ 1: ప్రాణమున్న జీవులకు మరణం తప్పనిసరి. మనలో చాలా మందికి మనం చనిపోయే రోజేదో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఈ విషయం తెలుసుకోవడానికి శతాబ్దాలుగా మనుషులు వివిధ జీవ కొలమాన పట్టికల ద్వారా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు కృత్రిమ మేధ(ఏఐ) ఆ లక్ష్యాన్ని స్వీకరించింది. ఏఐ సాయంతో పనిచేసే ‘డెత్ క్లాక్’ యాప్ ఈ విషయంలో బాగా ప్రాచుర్యం పొందింది. అయితే కేవలం డబ్బు చెల్లించే యూజర్లే దీని సేవలు పొందవచ్చు. జూలైలో ఆవిష్కరించిన ఈ యాప్ ఇప్పటి వరకు 1.25 లక్షల సార్లు డౌన్లోడ్ అయ్యిందని బ్లూమ్‌బర్గ్ తాజా నివేదిక పేర్కొంది. బ్రెంట్ ఫ్రాన్సన్ ఈ యాప్‌ను రూపొందించారు. 1200 జీవిత కాల అధ్యయనాలపై ఈ యాప్‌లోని ఏఐకు శిక్షణ ఇచ్చారు.
ఆహారం, వ్యాయామం, ఒత్తిడి స్థాయిలు, నిద్ర వంటి సమాచారాన్ని ఉపయోగించి మరణ తేదీపై ఈ యాప్ జోస్యం చెప్తుంది. ప్రామాణిక జీవిత కాల అంచనా పట్టికలపై ఈ యాప్ వెలువరించిన ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని ఫ్రాన్సన్ తెలిపారు. ఆరోగ్యం, దారుఢ్యం విభాగాల యాప్‌లలో ఈ యాప్ టాప్ ర్యాంక్‌లో ఉంది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలనుకొనేవారు ఏడాదికి రూ.3 వేల (40 డాలర్లు) దాకా చెల్లించాల్సి ఉంటుంది. మరణాన్ని కొంత కాలం ఆపగలిగేలా జీవన శైలిలో చేసుకోవాల్సిన మార్పులను డెత్ క్లాక్ యాప్ సూచిస్తుంది. మన మిగిలిన జీవిత కాలపు కౌంట్ డౌన్‌ను ఈ యాప్ చూపిస్తుంది. ‘మీ జీవితంలో మీరు చనిపోయే రోజు కన్నా అతి ముఖ్యమైన రోజు బహుశా ఉండకపోవచ్చు’ అని ఫ్రాన్సన్ తెలిపారు.