(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : హింసాత్మక ఘర్షణలతో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) నెత్తురోడింది. పాకిస్థాన్ భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకూ 30 మంది మరణించారు. మరో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శరణార్థులకు రిజర్వేషన్లు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలను పాక్ భద్రతా దళాలు అణచివేయడంతో పీవోకేలోని ముజఫరాబాద్, రావల్కోట్, బింబేర్, కొట్లీలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా పీవోకేలో తాజా పరిణామాలపై పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల్లో 19 మంది పిల్లలు, ఏడుగురు మహిళలు ఉన్నారు.
పీవోకేలో జూలై 27న శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో 45 స్థానాలకు గానూ 12 స్థానాలను శరణార్థులకు కేటాయించారు. ఈ నిర్ణయాన్ని జేఏఏసీ తీవ్రంగా వ్యతిరేకించింది. శరణార్థులకు కేటాయించామంటూ చెప్తున్న ఈ 12 స్థానాల్లో పాక్‌కు చెందిన వారే పోటీ చేయబోతున్నారని జేఏఏసీ ఆరోపిస్తున్నది. అందుకే, రిజర్వేషన్ స్థానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నది. పీవోకేలో శాంతి-భద్రతలు అంతకంతకూ క్షీణిస్తున్నాయని మండిపడింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, సహజ వనరుల విధ్వంసం, రాజకీయ వివక్ష, విద్యుత్తు కోతలు, ఇంటర్నెట్ షట్‌డౌన్ ఇలా సవాలక్ష సమస్యలు.. పీవోకే ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ధ్వజమెత్తింది. ఈ క్రమంలోనే తమ నిరసనలను ఉద్ధృతం చేస్తున్నట్టు ప్రకటించింది.
పాక్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గత ఆదివారం పీవోకేలోని పలు ప్రాంతాల్లో జేఏఏసీ నిరసన ప్రదర్శనలు చేపట్టింది. అయితే, ఆందోళనకారులు మారణాయుధాలు కలిగి ఉన్నారంటూ పాక్ భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓ స్థానిక వ్యాపారి ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన జేఏఏసీ నిరసనకారులతో స్థానిక దవాఖాన మార్చురీ ప్రాంగణం నిండిపోయింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు ప్రయత్నించడం, నిరసనకారులు ఎదురు తిరగడంతో పరిస్థితులు హింసాత్మకంగా మారాయి.

శాంతియుతంగా పోరాటం చేస్తున్న తమపై పాక్ ప్రభుత్వం హింసాత్మక చర్య మొదలుపెట్టిందని.. ఇందుకు ప్రతిగా మంగళవారం పీవోకే లాక్డౌన్ నిర్వహిస్తామని జేఏఏసీ నేతలు ప్రకటించారు. దీన్ని అడ్డుకోవడానికి పాక్ అధికారులు ప్రయత్నించడంతో.. ఇరువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ క్రమంలో భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకూ 30 మంది మరణించగా, 200 మంది గాయపడ్డారు. అయితే, మరణించిన పౌరుల సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నదని, ప్రభుత్వం కావాలనే ఈ సంఖ్యను తక్కువగా చూయిస్తున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా దేశీయ, విదేశీ పర్యాటకులు మంగళవారంలోగా పీవోకే విడిచి వెళ్లాలంటూ ఇప్పటికే అధికారులు సూచించారు. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద జేఏఏసీపై జూన్ 5న నిషేధం విధించామన్న అధికారులు.. శాంతి-భద్రతలను కాపాడేందుకే నిరసనకారులను నియంత్రణలోకి తీసుకొనే ప్రయత్నం చేశామని తెలిపారు.
పీవోకేలో జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో జోక్యం చేసుకోవాలని బ్రిటన్ ప్రభుత్వానికి అక్కడి 50 మంది ఎంపీలు విజ్ఞప్తి చేశారు. పీవోకేకు చెందిన బ్రాడ్ఫోర్డ్ ఈస్ట్ ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ నేతృత్వంలోని ఎంపీల బృందం ఈ మేరకు ప్రభుత్వానికి లేఖను అందించింది. ఉద్రిక్తతలను తగ్గించడానికి అవసరమైన దౌత్యపరమైన చర్యలు వెంటనే చేపట్టాలని కోరింది. మరోవైపు, ఇంగ్లండ్‌లోని పాక్ కాన్సులేట్ కార్యాలయానికి మంగళవారం చేరుకొన్న పలువురు కశ్మీరీ ప్రవాసులు.. పాక్ సర్కార్ వైఖరిని నిరసిస్తూ పెద్దయెత్తున నినాదాలు చేస్తూ ఆందోళనలు చేపట్టారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి పాకిస్థాన్ తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నదని భారత్ మంగళవారం ఆరోపించింది. ఆ ప్రాంతం నుంచి వస్తున్న నివేదికలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ పాకిస్థాన్ నుంచి తప్పుడు వార్తలు, వీడియోలు వెలువడటాన్ని భారత్ గమనించిందని, ఇది తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాక్ చేస్తున్న ఒక నిస్సహాయ ప్రయత్నమని అభివర్ణించారు. పీవోకేలో నిరసనకారులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, పలువురు నిరసనకారులు మరణించారని, చాలామంది గాయపడ్డారని ఆయన తెలిపారు. ఈ అమానుష చర్యలకు అంతర్జాతీయ సమాజం పాక్‌ను బాధ్యులుగా చేస్తుందని జైస్వాల్ అన్నారు.