Dead bodies : ఓ పడవ సముద్రంలో నుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఇది గమనించిన కొందరు నావికాదళానికి సమాచారం ఇచ్చారు. దాంతో నావికాదళం అధికారులు అక్కడికి చేరుకున్నారు. పెట్రోలింగ్ బోట్లో కొందరు నేవీ సిబ్బందిని కొట్టుకొచ్చిన పడవ దగ్గరికి పంపించారు. పడవ దగ్గరికి చేరుకున్న నేవీ అధికారులు అందులో ఏముందా అని చూశారు. అంతే ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే ఆ పడవలో సుమారు 30 మృతదేహాలు ఉన్నాయి. పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనెగల్ తీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సెనెగల్ రాజధాని నగరమైన డాకర్ తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఒక గుర్తు తెలియని పడవ కనిపించింది. సముద్రం ఒడ్డుకు కొట్టుకువస్తున్న ఆ పడవను స్థానికులు కొందరు గమనించి నేవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో అక్కడికి చేరుకున్న అధికారులు.. పెట్రోలింగ్ బోట్లో కొట్టుకొచ్చిన పడవ దగ్గరికి వెళ్లారు. అందులో కుప్పలు తెప్పలుగా మృతదేహాలను చూసి వాళ్లు షాకయ్యారు. ఏకంగా 30 మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి.
ఘటనపై నేవీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆ పడవ ఎక్కడి నుంచి వచ్చిందో కనుగొనడంతోపాటు మృతుల సంఖ్యను నిర్ధారించే దిశగా విచారణ సాగుతోంది. కాగా, ఈ నెల ప్రారంభంలోనూ సెనెగల్ తీరంలో ఓ వలసదారుల పడవ నీట మునిగి సుమారు 37 మంది మృతిచెందారు. ఘర్షణలు, పేదరికం, ఉద్యోగాల కొరత లాంటి కారణాలతో పశ్చిమాఫ్రికా నుంచి అనేక మంది వలసదారులు అక్రమంగా విదేశాలకు వలసపోతుంటారు. ఈ క్రమంలో ఏదో జరిగి పడవలోని వారు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.