లండన్, డిసెంబర్ 22: డాటా.. ప్రస్తుత సాంకేతిక యుగంలో ఈ పదం చదువురాని వాళ్లకు కూడా సుపరిచితమే.. మనం ఏ రకమైన డిజిటల్ వస్తువులను వాడినా అందులో డాటా అనేది తప్పకుండా ఉంటుంది. మనం పొద్దున లేవగానే మిత్రుడికి పంపే గుడ్‌మార్నింగ్ మెసేజ్ కూడా డాటానే. మనం నిత్యం వాడే మొబైల్ నుంచి అత్యంత క్లిష్టమైన సాంకేతికతల వరకు ఈ డాటా స్టోరేజ్ తప్పనిసరి. నిత్యం వందల కోట్ల మందికి సంబంధించిన డాటాను ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు స్టోర్ చేస్తూ పోతుంటాయి. పెద్ద పెద్ద సూపర్ కంప్యూటర్లలో ఇది నిక్షిప్తమై ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే 2025 నాటికి ఈ డాటా 300% పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీంతో మొత్తం డాటాను నిల్వచేయటానికి వీలు పడక సంక్షోభం రావచ్చని హెచ్చరిస్తున్నారు.
డాటా విస్ఫొటం
ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ (ఐడీసీ) ప్రకారం డాటా స్టోరేజ్ విస్తరణ అనేది ఎన్నటికీ ఆగిపోకూడని కార్యక్రమం. ఈ సంస్థ లెక్కల ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా 45 జెటాబైట్ (జెడ్బీ) డిజిటల్ స్టోరేజ్ సామర్థ్యం ఉండగా, 2025 నాటికి అది 175 జెడ్బీలకు పెంచాల్సిన అవసరం ఉన్నది. ఒక జెటాబైట్ లక్షకోట్ల గిగాబైట్ (జీబీ)లకు సమానం. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న డాటానంతా డీవీడీల్లో స్టోర్ చేస్తే.. అవి ఎన్ని అవసరమవుతాయో తెలుసా? వాటిని ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకొంటూ పోతే భూమి నుంచి చంద్రుని వద్దకు 23 సార్లు వరసలు పేర్చవచ్చట. 2019-20 మధ్యనే డాటా స్టోరేజ్ 41జెడ్బీ నుంచి ఏకంగా 64.2 జెడ్బీలకు పెరిగింది. ఆ సమయంలో కరోనా లాక్డౌన్ వల్ల ఉద్యోగులంతా సొంత డివైజ్లతో వర్క్‌ఫ్రమ్ హోం చేయటమే అందుకు కారణమని ఐడీసీ తెలిపింది.
డాటా స్టోరేజీకి కొత్త టెక్నాలజీ
డాటా నిల్వచేయటానికి భారీ కంప్యూటర్లు.. వాటిని ఉంచటానికి భారీ స్థలం కావాలి. కంప్యూటర్లను నడిపేందుకు భారీగా విద్యుత్తు అవసరం. ఈ క్లిష్ట సమస్యలను పరిష్కరించేందుకు కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసినట్టు ఆస్టన్ వర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. 5నానో మీటర్ల మందంతో కొత్తరకమైన పాలిమర్‌ను తయారుచేసినట్టు తెలిపారు. ఇది మన తలపై వెంట్రుకలో 10 వేలవ వంతు మందం మాత్రమే ఉంటుంది. ఈ పాలిమర్స్‌తో కంప్యూటర్లను తయారుచేస్తే అతి తక్కువ ప్రదేశంలో అసాధారణ స్థాయిలో డాటాను స్టోర్చేయవచ్చని పరిశోధకులు తెలిపారు.