Iran | ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేయడాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ ఖండించారు. ఇది అంతర్జాతీయ చట్టం, యూఎన్ చార్టర్, అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) తీవ్రమైన ఉల్లంఘనగా అభివర్ణించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్‌లో అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న అమెరికా అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకొని నేరపూరిత చర్యలకు దిగిందని అబ్బాస్ ఆరోపించారు. ‘ఈ ఉదయం జరిగిన సంఘటనలు దారుణమైనవి. ఇది అనంతమైన పరిణామాలను కలిగిస్తుంది. ఐక్యరాజ్య సమితిలోని ప్రతి సభ్యుడు ఈ అత్యంత ప్రమాదకరమైన, చట్టవిరుద్ధమైన, నేరపూరిత ప్రవర్తన గురించి ఆందోళన చెందాలి’ అన్నారు.
ఈ విషయంపై దృష్టి సారించాలని అంతర్జాతీయ సమాచారానికి పిలుపునిచ్చారు. వాషింగ్టన్ తీసుకున్న ప్రమాదకరమైన, చట్టవిరుద్ధమైన చర్యలపై ఐక్యరాజ్యసమితిలోని ప్రతి సభ్యుడు ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. యూఎస్ చార్టర్ నిబంధనలను ఉటంకిస్తూ.. ఇరాన్‌కు ఆత్మరక్షణ హక్కులు ఉన్నాయని తెలిపారు. వాటిని అమలు చేసుకునే స్వేచ్ఛ ఉందని ఇరాన్‌కు ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ నిబంధనల ప్రకారం స్వీయ రక్షణలో చట్టబద్దమైన ప్రతిస్పందనను అనుమతించే నిబంధనల ప్రకారం.. ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని.. ప్రయోజనాలను, ప్రజలను రక్షించుకునేందుకు ఉన్న అన్ని ఆప్షన్‌ను ఉపయోగించే హక్కు ఉందన్నారు. శనివారం అర్ధరాత్రి ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా దాడులకు దిగింది. ఇరాన్‌పై జరిగిన నీచమైన దాడులను, బలప్రయోగాన్ని ఖండించేందుకు ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ రాయబారి ఆదివారం భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ చట్టం, యూఎన్ చార్టర్ ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్ను జవాబుదారీగా చేసేందుకు యూఎస్ అవసరమైనన్ని చర్యలు తీసుకోవాలని రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ కోరారు. జూన్ 13న ఇరాన్ అణు స్థావరాలు, ఫెసిలిటీపై ఇజ్రాయెల్ చేసిన భారీ సైనిక దాడి తర్వాత జరిగిన రెచ్చగొట్టే, ముందస్తు ప్రణాళికతో కూడిన దురాక్రమణ చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తున్నది. అంతకు ముందు ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. మూడు అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. అయితే, తాజాగా అమెరికా బీ-2 స్టెల్త్ బాంబర్ జెట్లతో దాడులు చేసింది. ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ధ్రువీకరించారు.