కష్టకాలంలో అమెరికా.. క్రిస్మస్ సెలవుల్లో ట్రంప్

వాషింగ్టన్ : ఓ వైపు రోమ్ తగలబడిపోతుంటే.. మరోవైపు నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్న చందంగా ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభించడంతో అమెరికా అతలాకుతలం అవుతున్నది. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. క్రిస్మస్ను ఎలా జరుపుకోవడమా? అని ఆలోచనలో పడ్డారు. ఏది ఏమైతేనేం..? ఎవరెక్కడ పోతే ఏంటి..? అన్న రీతిగా ట్రంప్ ప్రవర్తిస్తున్నారు. అమెరికా ప్రజలు కరోనాతో అల్లల్లాడిపోతుంటే.. తన దారి రహదారి అంటూ సూపర్‌స్టార్ రజినీకాంత్ డైలాగ్‌లకు వల్లె వేయకుండానే తన తీరు ఇదేనంటూ ట్రంప్ వ్యవహరిస్తుండటంతో ప్రజలకు ఇబ్బందికరంగా తయారైంది.
అమెరికాలోని కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలు బాధపడుతుండగా.. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన భార్య మెలానియాతో కలిసి బుధవారం నుంచి క్రిస్మస్ సెలవులకు బయల్దేరి వెళ్లిపోయారు. ట్రంప్, మెలానియా జంట ఫ్లోరిడాలోని తమ విలాసవంతమైన మార్-ఏ-లెగో రిసార్ట్స్‌లో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి వచ్చినట్లు సమాచారం. మార్-ఏ-లెగో రిసార్ట్స్‌ను పామ్ బీచ్ రిసార్ట్ అని కూడా పిలుస్తుంటారు.
ఇమేజి బిల్డింగ్ చేపట్టడం మంచిదేనా?
ఎలెక్ట్ ప్రెసిడెంట్ జో బైడెన్ జనవరి 20 న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వైట్ హౌస్‌లో ఉండేందుకు ట్రంప్‌కు ఇప్పుడు నెల రోజుల కన్నా తక్కువ సమయం ఉన్నది. అధ్యక్షులుగా దిగిపోతున్న వారు తమ చివరి రోజులను ఇమేజ్ బిల్డింగ్ కోసం ఉపయోగించటానికి ఇష్టపడరని గత అమెరికా ప్రెసిడెంట్స్ చరిత్ర చూస్తే తెలుస్తున్నది. దేశంలో కోటి కేసుల నమోదవడం, మూడు లక్షలకు పైగా మరణాలు సంభవించినప్పటికీ.. అవేమీ పట్టించుకోకుండా ట్రంప్ క్రిస్మస్ హాలిడేకు బయలుదేరడానికి ఇదే కారణంగా చెప్పుకోవచ్చు. అయితే, తమ ఈ సెలవుదినాలను ఎంతవరకు ఇమేజి బిల్డిండ్ కోసం వినియోగం చేసుకోగలుగుతారు అనే దానిపై సందేహాలున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమిని ట్రంప్ ఇంకా అంగీకరించకపోవడం.. బైడెన్ విజయాన్ని ఒప్పుకోకపోవడమే దీనికి కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు.
బైడెన్‌ను అభినందించేదెప్పుడో..!
మెరైన్ వన్ హెలికాప్టర్లో మార్-ఏ-లెగో రిసార్ట్‌కు వచ్చిన సమయంలో డొనాల్డ్ ట్రంప్ చాలా సంతోషంగా కనిపించాడు. చాలా మందిని కలుసుకున్నారు. అనంతరం రిసార్ట్స్‌కు వెళ్లారు. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3 న వెలువడిన అనంతరం.. రెండు కేసుల్లో ఆయన చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నికలలో రిగ్గింగ్ లేదా లెక్కింపు జరుపలేదని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ తాను చేసిన ఆరోపణలపై మొండిగా ఉన్నారు. అమెరికాలో 200 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం.. ఎలెక్ట్ అధ్యక్షుడిని ట్రంప్ ఇంకా అభినందించలేదు. బైడెన్ విజయాన్ని ఒప్పుకోకపోవడం వల్లనే ఆయనను అభినందించేందుకు ట్రంప్ ముందుకు రావడం లేదని నిపుణులు భావిస్తున్నారు. గత అమెరికా సంప్రదాయాలకు తిలోదకాలిచ్చే విధంగా ట్రంప్ కనిపిస్తున్నారని రాజకీయ నిపుణులు చెప్తున్నారు.
బుధవారం నాడు రిసార్ట్స్‌కు బయల్దేరే ముందు చాలా మందికి ఆయన క్షమాభిక్ష ప్రసాదించారు. రెండు విషయాలపై ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి.. కరోనా రిలీఫ్ ప్యాకేజీని ఆమోదించలేదు. రెండోది.. రక్షణ బిల్లు. దీనికి కాంగ్రెస్ నుంచి అనుమతి లభించింది. అయితే ఇది చైనా, రష్యా చేతుల్లో ఆడటం లాంటిదని అంటూ ట్రంప్ దాన్ని కూడా ఆపారు. అంతేకాకుండా, ఓటమిని అంగీకరించి బైడెన్‌ను అభినందించమని అడుగుతున్న తన పార్టీ నాయకులపై కూడా కఠినమైన వైఖరిని ప్రదర్శించడం విశేషం.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.