శనివారం 04 ఏప్రిల్ 2020
International - Feb 19, 2020 , 10:51:11

2 వేలకు చేరిన కరోనా వైరస్ మృతుల సంఖ్య

2 వేలకు చేరిన కరోనా వైరస్ మృతుల సంఖ్య

బీజింగ్‌ : కరోనా వైరస్‌(కొవిడ్‌-19) బారిన పడి ఇప్పటి వరకు 2 వేల మంది మృతి చెందినట్లు చైనా జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. హుబే ప్రావిన్స్‌లో నిన్న ఒక్క రోజే 136 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1749 కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు కొవిడ్‌-19 కేసుల నమోదు సంఖ్య 74 వేలకు చేరింది. 

చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ఆ దేశంలో ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. ఇప్పటివరకూ ఈ వైరస్‌ సోకి సాధారణ ప్రజలతో పాటు వైద్యులు కూడా చనిపోతుండడం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్న ఓ దవాఖాన డైరెక్టరే ఈ వ్యాధికి బలయ్యారు. వుచాంగ్‌ దవాఖాన డైరెక్టర్‌ లియూ చిమింగ్‌ కరోనా సోకి మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. లియూ చిమింగ్‌ను కాపాడేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైనట్లు వైద్యులు తెలిపారు. లియూ చిమింగ్‌ సోమవారం రాత్రే మృతి చెందినట్లు కొన్ని చైనా ఛానళ్లు వార్తల్ని ప్రసారం చేశాయి. 

అయితే వెనువెంటనే ఆయన మరణించలేదని, ఆయనను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నాయి. అయితే, లియూ చిమింగ్‌ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కరోనా వైరస్‌ గురించి తొలిసారిగా గతేడాది వెల్లడించిన వైద్యుడు లీ వెన్లియాంగ్‌ను అధికారులు వదంతులను వ్యాప్తి చేయవద్దంటూ గత డిసెంబరులో హెచ్చరించడం తెలిసిందే. ఆ తరువాత ఆయన కరోనా పేషెంట్లకు చికిత్సనందిస్తూ అదే వ్యాధి సోకి మరణించాడు. ఇప్పుడు లియూ మరణాన్ని కూడా ఆ వైద్యుడి మృతితో పోలుస్తూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో పలు పోస్టులు చేశారు. ఇద్దరి మరణం విషయాన్ని తొలుత చైనా అధికార వార్తా సంస్థలు ప్రసారం చేశాయని, ఆ తర్వాత ఆ వార్తల్ని తొలగించాయని ఓ నెటిజన్‌ గుర్తుచేశారు. 


logo