బీజింగ్, డిసెంబర్ 26: చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. పెద్ద ఎత్తున జనాలు వైరస్ బారిన పడుతున్నారు. దవాఖానాలు బాధితులతో నిండిపోయాయి. ఐసీయూల్లో బెడ్లు ఖాళీగా లేవు. అత్యవసర వైద్యం అందడం లేదు. మందుల దుకాణాల్లో మందులు కూడా కరువయ్యాయి. ఎక్కడ చూసినా ఆంబులెన్సుల శబ్ధాలే వినిపిస్తున్నాయి. శ్మశానాల ముందు భారీగా లైన్లు కనిపిస్తున్నాయి. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో చైనా ప్రజలు గడుపుతున్నారు. ఇంతకాలం జీరో కొవిడ్ పాలసీని కఠినంగా అమలు చేసిన చైనా ఇటీవల అనూహ్యంగా సడలింపులు ఇచ్చింది. దీంతో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే, చైనా మాత్రం కరోనా కేసుల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నది. డిసెంబర్ 7న కరోనా నిబంధనలు సడలించిన నాటి నుంచి ఏడుగురు మాత్రమే కొవిడ్‌తో మరణించారని, కేసుల సంఖ్య కూడా సుమారు 5 వేలే అని చైనా చెప్తున్నది.
కానీ, వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో చైనాలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతుందని, వచ్చే ఏడాది చివరి నాటికి దాదాపు 10 లక్షల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని పలు సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఎట్టకేలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కరోనా పరిస్థితులపై నోరు విప్పారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సోమవారం అధికారులను ఆదేశించారు.అటు.. కరోనా నేపథ్యంలో చైనాలో పరిశ్రమలు, దుకాణాలు, హోటళ్లు మూతపడుతున్నాయి. వ్యాపారాలు, రవాణా స్తంభించిపోయింది.