Coal Mine Collapse | చైనా (China) లో విషాదం చోటుచేసుకున్నది. ఓ బొగ్గు గని (Coal Mine) కుప్పకూలిపోవడంతో ఇద్దరు మృతిచెందారు. 50 మందికి పైగా కార్మికులు గల్లంతయ్యారు. ఈ ఘటన ఇన్నర్ మంగోలియా (Inner Mangolia) లో జరిగింది. శిథిలాల తొలగించే పనిలో రెస్క్యూ బృందాలు నిమగ్నమయ్యాయి.
చైనా మీడియా తెలిపిన వివరాల ప్రకారం, అల్క్సా లీగ్ (Alxa League) లో ఉన్న బొగ్గు గనిలో తవ్వకాలు జరుగుతుండగా ఒక్కసారి కుప్పకూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ (rescue operations) కొనసాగుతున్నది. దాదాపు 200 మంది రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు ముగ్గురు కార్మికులను బయటకు తీయగా.. వారిలో ఇద్దరు మరణించారని రెస్క్యూ వర్కర్ తెలిపారు. ప్రమాదం సమయంలో గనిలో ఎంత మంది కార్మికులు ఉన్నారనే సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదు.
మైనింగ్ పరంగా చైనాలోని ఇన్నర్ మంగోలియా ఒక ముఖ్యమైన ప్రాంతం. గనిలో ఎంత భాగం కూలిపోయిందో డ్రోన్ల సాయంతో గుర్తిస్తున్నామని గనిలోని ఓ ఉద్యోగి తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా చైనాలో గని భద్రతా చర్యలు మెరుగయ్యాయి. అయితే భద్రత లేని గనుల్లో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్లో వాయవ్య జిన్జియాంగ్ (North-Western Xinjiang) ప్రాంతంలోని ఓ గని కూలిపోయింది. ఆ గనిలో 40 మంది పని చేస్తుండగా.. మరణించిన వారి కచ్చితమైన లెక్క ఇప్పటికీ వెల్లడి కాలేదు. 2021లో ఉత్తర షాంగ్సీ ప్రావిన్స్‌లోని బొగ్గు గని ఘటనలో ఇద్దరు చనిపోగా.. 20 మంది కార్మికులను రక్షించారు.