CIA : అమెరికా (USA) లో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం భారీఎత్తున ఉద్యోగాల్లో కోత విధిస్తోంది. ఈ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగానే యూఎస్ ప్రభుత్వం తాజాగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) లో సంస్కరణలకు సిద్ధమైంది. ఏజెన్సీలోని 1200 మంది ఉద్యోగులను తొలగించడానికి కసరత్తు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలుపుతున్నాయి.
ఇదే పంథాలో మరికొన్ని ఏజెన్సీలలోనూ వేలాది ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని ఆ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ ఉద్యోగుల తొలగింపు వార్తలపై సీఐఏ ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో స్పందించాల్సి ఉంది. సీఐఏలోని ప్రణాళికాబద్ధమైన కోతల గురించి అమెరికా ప్రభుత్వం చట్టసభ్యులకు తెలియజేసినట్లు సమాచారం. ఏజెన్సీలో ఇకపై నియామకాల తగ్గింపునకు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఏజెన్సీలో కొత్త శక్తిని నింపడానికి, మరింత మెరుగ్గా మార్చడానికి చేపట్టిన సమగ్ర వ్యూహంలో భాగంగా కొన్ని మార్పులు చేస్తున్నట్లు సీఐఏ ప్రతినిధి రాట్క్లిప్ తెలిపారు. తన నేతృత్వంలో సీఐఏ పక్షపాతాలు లేకుండా నిష్పాక్షికంగా పని చేస్తోందని అన్నారు. ఎంత కష్టమైనప్పటికీ తాము ప్రపంచంలో ఎవరూ వెళ్లలేని ప్రదేశాలకు వెళ్లి ప్రతి మూలలోని నిఘా సమాచారాన్ని సేకరిస్తామని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోతల్లో భాగంగా ట్రంప్ యంత్రాంగం అక్కడి ప్రభుత్వ విభాగాలపై కొరడా ఝళిపిస్తోంది. ఇందులో భాగంగా ఆరోగ్యశాఖలో 10 వేల ఉద్యోగాలు, రెవెన్యూ సర్వీసులో 20 వేల ఉద్యోగాలు, 24 వేల సైనిక ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్మిక శక్తిని 82 వేల నుంచి 62 వేలకు తగ్గించుకోనున్నట్లు సమాచారం. మరోవైపు ఉద్యోగాల తొలగింపునకు ట్రంప్ సర్కారు బైఅవుట్‌ను అస్త్రంగా చేసుకుంది.
ఈ మేరకు ఒక ఈ-మెయిల్‌ను 20 లక్షల మంది ఉద్యోగులకు పంపారు. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకొంటే ఎనిమిది నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు. ఉద్యోగాలు మానేద్దామని అనుకొని ఆగిపోయినవారు దీనిని ఎంచుకోవచ్చని సూచించారు. ఈ ఆఫర్‌తో ఇప్పటివరకు దాదాపు 40 వేల మంది ఉద్యోగాల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో అనవసర ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ ‘డోజ్’ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యోగాల కోతలో మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం కీలకపాత్ర పోషించింది. ఉద్యోగాల తొలగింపువల్ల అమెరికాకు వేల బిలియన్ డాలర్లు ఖర్చు మిగులుతుందని ట్రంప్ చెబుతున్నారు.