CIA offer : చైనా (China) లో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పాలనలో అణచివేతను ఎదుర్కొంటున్న అక్కడి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి అమెరికా (USA) నిఘా సంస్థ సీఐఏ (Centrel Intelligence Agency – CIA) సంచలన ప్రకటన చేసింది. ‘రండి.. మాతో కలిసి పనిచేయండి’ అంటూ మాండరిన్ భాషలో రిక్రూట్మెంట్ వీడియోలను రిలీజ్ చేసింది. సైనికపరంగా, వ్యూహాత్మకంగా చైనా తమకు అతిపెద్ద విరోధిగా భావిస్తున్న అగ్రరాజ్యం అమెరికా.. బీజింగ్ గూఢచర్య ఆపరేషన్లకు ప్రతిగా ఈ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
చైనా అధికారుల నుంచి రహస్యాలు సేకరించేందుకే ఈ వీడియోలు రిలీజ్ చేశామని సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ చెప్పడం గమనార్హం. నిఘా వ్యవస్థలో మానవ వనరులను పెంచుకోవడంతోపాటు చైనాపై మరింత దృష్టి పెట్టేందుకు ఈ చర్యలు చేపట్టామని చెప్పారు. ఆర్థికంగా, సైనికపరంగా, సాంకేతికంగా ప్రపంచంపై ఏకఛత్రాధిపత్యం చెలాయించాలని చైనా భావిస్తోందన్నారు. ఆ దేశం నుంచి తమకు గూఢచర్యం ముప్పు పొంచి ఉందని, దాన్ని పరిష్కరించుకునేందుకే ఈ వీడియోలు విడుదల చేశామని చెప్పారు.
చైనా అధికారుల నుంచి రహస్యాలు సేకరించడమే ఆ వీడియోల లక్ష్యమని రాట్క్లిఫ్ పేర్కొన్నారు. సీఐఏ తన యూట్యూబ్, ‘ఎక్స్’ ఖాతాల్లో ఈ రెండు వీడియోలను విడుదల చేయగా గంటల వ్యవధిలోనే 50 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ వీడియోల్లో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ కమ్యూనిస్టు పార్టీలో అవినీతి వ్యతిరేక ఉద్యమం పేరుతో రాజేసిన నిప్పును ఉదహరిస్తూ సినిమాటిక్ సన్నివేశాలను జోడించారు. నిజాయతీగా పనిచేస్తున్న ఓ పార్టీ నాయకుడు అధికార ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన పరిస్థితిలో ఉంటాడు. దాన్ని అంగీకరించలేక, భయంతో బతకలేక సీఐఏను ఆశ్రయిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.
‘నా జీవితాన్ని, నా భవిష్యత్తును నా అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలంటే సీఐఏలో చేరాలి’ అనే క్యాప్షన్‌తో అమెరికా సంస్థ ఈ వీడియోలను విడుదల చేసింది. చైనా అధికారులకు మరింత చేరువవ్వాలనే ఉద్దేశంతో మాండరిన్ భాషలో ఈ వీడియోను రూపొందించింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వాటిపై చైనా ఇంకా స్పందించలేదు.