Supersonic Engine | బీజింగ్, డిసెంబర్ 19: పౌర విమానయానంలో అత్యంత వేగవంతమైన సూపర్‌సానిక్ విమాన ఇంజిన్‌ను చైనా సైంటిస్టులు తయారుచేశారు. గంటకు 5వేల కిలోమీటర్ల వేగంతో(మ్యాక్-4 స్థాయి) ప్రయాణించగల సూపర్‌సానిక్ జెట్ ఇంజిన్‌ను చైనా విజయవంతంగా ప్రయోగించింది. 20 కిలోమీటర్ల ఎత్తులో సూపర్‌సానిక్ ఇంజిన్ ఒక గంటకు 5,000 కిలోమీటర్ల వేగాన్ని అందుకుందని చైనా ఆన్లైన్ మీడియా పేర్కొన్నది. బీజింగ్ నుంచి న్యూయార్క్‌కు కేవలం రెండు గంటల్లో చేరుకోగల శక్తివంతమైన ఎయిర్‌క్రాఫ్ట్‌ను తీసుకురావాలన్న లక్ష్యంలో భాగంగా ఈ సరికొత్త ఇంజిన్‌ను చైనా ఇటీవలే ఆవిష్కరించింది.
‘జిన్డో400’గా పేర్కొంటున్న ఈ ఇంజిన్‌ను ఆ దేశంలోని ‘స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్’ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. షింజు యూనివర్సిటీ సైంటిస్టులు ఇంజిన్‌ను డిజైన్ చేశారు. సాంప్రదాయ విమాన ఇంజిన్లలో ఉన్నట్టు దీంట్లో టర్బైన్లు, కంప్రెషర్లు ఉండవు. శబ్ద తరంగాల నుంచి పుట్టిన శక్తి ఇంజిన్లను నడిపిస్తుంది. సూపర్‌సానిక్ ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను చైనా కంపెనీ 2027నాటికి తీసుకురాబోతున్నది. ఇందుకు సంబంధించి తొలి కమర్షియల్ హై-స్పీడ్ ఫ్లైట్‌ను 2030కల్లా ప్రవేశపెడతామని కంపెనీ తెలిపింది.