బీజింగ్, జూలై 13: చెరుకు పండించి.. దాని నుంచి చక్కెరను ఉత్పత్తి చేయాలంటే, పెద్ద ఎత్తున భూమి, నీటి వనరులు అవసరం. దీనికి ప్రత్యామ్నాయంగా ‘కార్బన్ డయాక్సైడ్’ను చక్కెరగా (సుక్రోజ్) మార్చే సరికొత్త పద్ధతిని చైనా సైంటిస్టులు అభివృద్ధి చేశారు. ‘జర్నల్ సైన్స్’ కథనం ప్రకారం, తొలుత కార్బన్ డయాక్సైడ్ను హైడ్రోజీకరణ చేయటం ద్వారా ‘మిథనాల్’ను తయారుచేస్తారు. అటు తర్వాత ‘బయోట్రాన్స్ఫార్మేషన్’ వ్యవస్థలో ఎంజైమ్స్ మిథనాల్ నుంచి కృత్రిమ చక్కెరను విజయవంతంగా తయారుచేసినట్టు ‘టియాన్జిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ’ ప్రకటించింది.
సుక్రోజ్ మాత్రమే కాదు..ఫ్రక్టోజ్, పిండిపదార్థాలను కూడా కృత్రిమంగా ఉత్పత్తి చేయవచ్చునని వారి పరిశోధన పత్రం పేర్కొన్నది. ‘కార్బన్ డయాక్సైడ్ను ఆహారం, రసాయనాలుగా కృత్రిమంగా మార్చటమన్నది.. పర్యావరణం, జనాభా సంబంధిత సవాళ్ల పరిష్కారానికి చక్కటి వ్యూహం’ అని ‘జర్నల్ సైన్స్’ బులెటిన్ తెలిపింది.