బీజింగ్, మార్చి 15: వందేండ్ల పాటు నిరంతరాయంగా పనిచేసే అణు బ్యాటరీని చైనా పరిశోధకులు ఆవిష్కరించారు. బలహీనమైన రేడియోధార్మిక ఐసోటోప్ కార్బన్-14 అనే పదార్థంతో దీన్ని తయారు చేశారు. రేడియోధార్మిక పదార్థాల ఎమిషన్ ద్వారా ఇది విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. చార్జింగ్ లేకుండానే దశాబ్దాల పాటు సేవలందిస్తుంది.
చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో ఉన్న నార్త్‌వెస్ట్ నార్మల్ యూనివర్సిటీ, బెటా ఫార్మాటెక్ సంయుక్తంగా ఈ బ్యాటరీని అభివృద్ధి చేశాయి. 50 ఏండ్ల జీవితకాలంతో అభివృద్ధి చేసినప్పటికీ అసాధారణ పరిస్థితుల్లోనూ వందేండ్ల పాటు సేవలందిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. సిలికాన్-కార్బన్ సమ్మేళనంతో కూడిన సెమీకండక్టర్‌తో చేసిన ఈ బ్యాటరీ -100 డిగ్రీల నుంచి 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను తట్టుకుంటుందని అంటున్నారు.
ధ్రువప్రాంతాలతో పాటు అంతరిక్షంలోనూ ఇది ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుందని విశ్వసిస్తున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, పేస్‌మేకర్స్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్ లాంటి వైద్య అవసరాలను కూడా ఇది తీరుస్తుంది. భవిష్యత్తులో దీని తయారీని మరింతగా పెంచాలని భావిస్తున్నారు. అందుకు కార్బన్-14 ఉత్పత్తిని పెంచేందుకు ఐసోటోప్ సెపరేషన్ టెక్నాలజీ అభివృద్ధిపై యూనివర్సిటీ సన్నాహాలు చేస్తున్నది.