బీజింగ్ : పదిహేనేళ్ల బాలిక నీనీ కడుపులో నుంచి 2 కేజీల వెంట్రుకల ఉండను వైద్యులు తొలగించారు. ఆమె ఆరేళ్ల నుంచి తన జుట్టును తానే తింటుండటంతో ఇది ఏర్పడింది. విపరీతమైన బలహీనంగా, సన్నంగా ఉండటం, ఆరు నెలల నుంచి రుతుస్రావం ఆగిపోవడం, కడుపు నొప్పి తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను వుహాన్‌లోని పిల్లల దవాఖానలో చేర్పించారు. జూలై 14న ఆమెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆమె కడుపు సాధారణం కన్నా రెట్టింపు ఉబ్బిందని వైద్యులు గుర్తించారు. శస్త్ర చికిత్స తర్వాత ఐదు రోజుల నుంచి ఆమె ఆహారాన్ని తీసుకుంటున్నది.
ప్రస్తుతం కోలుకుంటున్నది. ఈ నెల 5న చెకప్ కోసం వచ్చిన నీనీ వైద్యులకు స్వీట్స్‌తో చేసిన బొకేను అందజేసి, కృతజ్ఞతలు తెలిపింది. తన కుమార్తె బరువు పెరుగుతున్నదని, బాగానే కోలుకుంటున్నదని ఆమె తల్లి చెప్పారు. జుట్టు, గాజు పెంకులు వంటివాటిని తినే పరిస్థితిని ట్రైకోఫాగియా అంటారని డాక్టర్ లియు ఫాంగ్ చెప్పారు. వీరికి చికిత్స చేసేటపుడు ఆహారంలో మార్పులు, మానసిక సంరక్షణ, మందుల వాడకం వంటివాటిని సూచిస్తామని తెలిపారు. ఇటువంటి వారు విటమిన్లతో కూడిన ఆహారాన్ని తినాలని చెప్పారు. ద్రవాహారాన్ని తీసుకుంటే వీరి ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు.