Billionaire Hui Ka Yan | చైనాకు చెందిన బిలియనీర్ అప్పులపాలై సర్వం కోల్పోవాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు ఆసియాలోనే రెండో ధనికుడిగా ఉన్న ఈయన ఇప్పుడు తన సంస్థను కాపాడుకునేందుకు భవనాలు, జెట్లు అమ్ముకోవాల్సి వస్తున్నది. ఆయన సంపద ఒక్కసారిగా 93 శాతం తగ్గుదల కనిపించింది. ఆయనే చైనా ఎవర్‌గ్రాండే గ్రూప్ చైర్మన్ హుయ్ కా యాన్. ఇకప్పుడు ఈయన ఆస్తి 42 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఇప్పుడు 3 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తెలిపింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, చైనాలోని ఐదుగురు అత్యంత ధనవంతులైన స్థిరాస్తి వ్యాపారులు కూడా గత రెండేండ్లలో కలిపి దాదాపు 65 బిలియన్ డాలర్లను కోల్పోయారు.
చైనాకు చెందిన ఎవర్‌గ్రాండే గ్రూప్ అధిపతి హుయ్ కా యాన్.. ఇప్పుడు పీకలోతు అప్పుల్లో మునిగిపోయాడు. దాదాపు 300 బిలియన్ డాలర్ల మేర అప్పులు చెల్లించాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు. ఈయన సంస్థ చైనాలో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్‌గా ఉన్నది. గత కొన్నాళ్లుగా చైనాలో రియల్ ఎస్టేట్ అమ్మకాలు పడిపోవడంతో ఈ సంస్థ ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నది. కంపెనీని కాపాడేందుకు ఇళ్లు, ప్రైవేట్ జెట్లను హుయ్ విక్రయించాడు. దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉన్న ఈ కంపెనీ.. 2020 లో 110 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అమ్మకాలను సాధించింది. 280 కిపైగా నగరాల్లో విస్తరించి మంచి అభివృద్ధిని సాధించింది. సీఎన్ఎన్ ప్రకారం, కంపెనీ గత ఏడాది దాని ప్రాథమిక రుణ పునర్నిర్మాణ ప్రణాళికను అందించడంలో విఫలమైంది. ఇది సదరు కంపెనీ భవిష్యత్‌పై అనేక ప్రశ్నలను తెరపైకి తీసుకొచ్చింది.
చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ) నుంచి వచ్చిన తాజా సంకేతంతో హుయ్ సంపద క్షీణించడంతో పాటు రాజకీయంగా ఒంటరి అయ్యారు. సీపీపీసీసీలో 2008 నుంచి ఉన్న ఈ వ్యాపారవేత్త.. 2013 నుంచి ఎలైట్ 300-సభ్యుల స్టాండిండ్ కమిటీలో కొనసాగుతున్నారు. రుణాల ఊబిలో హుయ్ ఇరుక్కోవడంతో గత ఏడాది సీపీపీసీసీ వార్షిక సమావేశానికి రావొద్దని సూటిగా చెప్పారు. అలాగే, వచ్చే ఐదేండ్లపాటు సీపీపీసీసీ ని ఏర్పాటుచేసే వ్యక్తుల జాబితా నుంచి కూడా తొలగింపునకు గురయ్యాడు.