బీజింగ్, డిసెంబర్ 25: అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దు దాటి చైనా బలగాలు భారత భూభాగంలోకి చొరబడటం వెనుక భారీ ఉద్దేశమే ఉన్నదా? బంగారం కంటే అతి విలువైన దాని కోసం సరిహద్దు దాటే ప్రయత్నం చేశారా? అంటే తాజా పరిశోధనలు నిజమేనని తేటతెల్లం చేస్తున్నాయి. బంగారం కంటే విలువైన ఆ వస్తువు ఏమిటి? అంటే.. సూపర్ మష్రూమ్గా పిలుచుకొనే హిమాలయన్ గోల్డ్ (కార్డిసెప్స్). వీటికోసమే పలు మార్లు చైనీయులు భారత భూభాగంలోకి చొరబడ్డారని ఇండో పసిఫిక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ (ఐపీసీఎస్సీ) వెల్లడించింది.
ఏమిటీ కార్డిసెప్స్?
హిమాలయాల్లో పెరిగే ఒక రకమైన ఫంగస్ ఇది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని, క్యాన్సర్ కణాలను అడ్డుకొనే శక్తి ఉన్నదని చైనీయులు భావిస్తున్నారు. అందుకే ఈ శిలీంధ్రం విలువ బంగారం కన్నా ఎక్కువ. ఇవి క్వింఘై-టిబెటన్ పీఠభూమి ప్రాంతం, హిమాలయాల్లోనే పెరుగుతాయి. ఇవి పసుపు, కాషాయ రంగులో సన్నని పోగుల్లా ఉంటాయి. అతిశీతల వాతావరణం ఉన్న చోటే సాగవుతాయి.
ఐపీసీఎస్సీ చెప్తున్నదిదీ!
చైనాలో సాగు తగ్గిపోవటంతో వారి కండ్లు హిమాలయ ప్రాంతాలపై పడ్డాయని ఐపీసీఎస్సీ తెలిపింది. హిమాలయాల్లోని కొన్ని ప్రాంతాల ప్రజలు ఈ ఫంగస్‌ను సేకరించి, అమ్మి డబ్బు సంపాదిస్తున్నారు. టిబెటన్ పీఠభూమి, హిమాలయ ప్రాంతాల ప్రజల్లో 80 శాతం మంది దీనిపైనే ఆధారపడుతున్నారు. అయితే, ఈ ఫంగస్ కోసమే చైనీయులు భారత్‌పై పడ్డారని ఐపీసీఎస్సీ పేర్కొన్నది.
అస్సాంలో 8 ఏండ్లుగా పరిశోధనలు
అద్భుత ఔషధ గుణాలు కలిగిన కార్డిసెప్స్పై అస్సాంలోని బోడో విశ్వవిద్యాలయ పరిశోధకులు 8 ఏండ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ప్రయోగశాలలో నియంత్రిత వాతావరణంలో వీటిని సాగు చేస్తున్నారు. -86 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఆరబెట్టి, పోషక, ఔషధ గుణాలకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడుతున్నారు.
2022లో 8,900 కోట్ల మార్కెట్ విలువ
దేశ, విదేశీ మార్కెట్లో కార్డిసెప్స్‌కు భారీ డిమాండ్ ఉన్నది. ఒక్క 2022లోనే దీని మార్కెట్ విలువ రూ.8,900 కోట్లు. ఈ ఫంగస్ ఉత్పత్తిలో, ఎగుమతిలో చైనాది అగ్రస్థానం. రెండేండ్లుగా చైనాలో కార్డిసెప్స్ సాగు బాగా తగ్గిపోయింది. డిమాండ్ పెరిగింది.
శాస్త్రీయంగా రుజువు కాకపోయినా కిడ్నీ సమస్యల దగ్గరి నుంచి నపుంసకత్వాన్ని తగ్గించటం వరకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని చైనా ప్రజలు నమ్ముతున్నారు. దీంతో దశాబ్దకాలంగా దీనికి డిమాండ్ పెరిగింది. పలు చైనా కంపెనీలు కార్డిసెప్స్ సాగు చేసే కొండ ప్రాంతాలను రూ.కోట్లు ఇచ్చి తమ ఆధీనంలోకి తెచ్చుకొంటున్నాయి.