బీజింగ్: చైనీస్ పరిశోధకులు సరికొత్త హైబ్రిడ్ వరి వంగడాన్ని అభివృద్ధి చేశారు. ఇది విత్తనాల ప్రతిరూపం (క్లోన్) ద్వారా తన నకలును తానే తయారు చేసుకుంటుంది. ఇది ఫలదీకరణ లేకుండా విత్తనాలను అభివృద్ధి చేసే ప్రక్రియ అపొమిక్సిస్ ద్వారా దాదాపు కచ్చితమైన క్లోనల్ రీప్రొడక్షన్ సామర్థ్యం గల హైబ్రిడ్ వరి వంగడం. ఒక తరం తర్వాత మరో తరానికి తన అత్యధిక దిగుబడి లక్షణాలను కాపాడుకుంటుంది. సాధారణంగా ఖరీదైన హైబ్రిడ్ విత్తనాలను రైతులు ప్రతి సీజన్లోనూ కొనవలసి ఉంటుంది. తమ తాజా వరి వంగడం ఈ అడ్డంకిని తొలగించి, అంతర్జాతీయ వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొస్తుందని పరిశోధకులు చెప్పారు. కొన్ని అంచనాల ప్రకారం, ఈ కొత్త హైబ్రిడ్ రకాన్ని ప్రపంచంలోని వరి సాగు రైతులందరూ నాటితే, ప్రపంచ వరి ఉత్పత్తి రెట్టింపు అవుతుంది.
జన్యుపరంగా రెండు వేర్వేరు పేరెంట్స్ నుంచి సంకరజాతి వరి వంగడాన్ని సృష్టించడంలో చైనా ప్రసిద్ధి చెందింది. ఈ వరి వంగడాలు అత్యధిక దిగుబడిని ఇస్తాయి. ప్రపంచంలో మొదటి అత్యధిక దిగుబడిని ఇచ్చే వాణిజ్యపరమైన వరి రకాలను అభివృద్ధి చేసినది చైనాయే. అంతేకాకుండా, హైబ్రిడ్ వరి విషయంలో ప్రపంచంలో అతి పెద్ద ఉత్పత్తిదారు, వినియోగదారుగా కూడా నిలిచింది. రైతులు ప్రతి సంవత్సరం కొత్త విత్తనాలను కొనవలసి ఉంటుంది కాబట్టి హైబ్రిడ్ వరి రైతులకు చాలా ఖర్చుతో కూడినది. సాధారణ వరి విత్తనాల ధర కన్నా సుమారు 100 రెట్ల వరకు ఉండవచ్చు. అంతేగాక అత్యధిక ధర గల ఈ విత్తనాల నుంచి వచ్చే మొక్కలు తమ హైబ్రిడ్ శక్తిని, సంకరం చేయడం వల్ల వచ్చే ఉత్తమ లక్షణాలను కోల్పోతే, రైతులు ప్రతి సీజన్లోనూ మళ్లీ కొత్తగా విత్తనాలను కొనవలసి వస్తుంది.
చైనీస్ వ్యవసాయ శాస్ర్తాల అకాడమీకి చెందిన చైనా జాతీయ వరి పరిశోధన సంస్థ పరిశోధక బృందం ఈ వరి వంగడాన్ని అభివృద్ధి చేసింది. ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన వాంగ్ కేజియాన్ మాట్లాడుతూ, హైబ్రిడ్ వరికి అపొమిక్సిస్ లక్షణాన్ని పరిచయం చేయడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఈ విత్తనాలను వాణిజ్యపరంగా అమ్మితే, ధరలు బాగా తగ్గుతాయని అన్నారు. ఈ వరి వంగడపు కొత్త ఫిక్స్8 సిరీస్ 99.7 శాతానికిపైగా క్లోనింగ్ ఎఫిషియెన్సీని సాధించింది. తన నకలును తానే సృష్టించుకోగలిగే సూపర్ రైస్‌ను సృష్టించగలిగింది. అయితే, ఈ వరి వంగడం అభివృద్ధిలో నిర్దిష్ట వ్యాధి నిరోధక లక్షణాలపై ఈ పరిశోధన దృష్టి సారించలేదు. నిరవధికంగా ఈ లక్షణాలను సాధించే విధంగా ఈ టెక్నాలజీని రూపొందించారు. మరోవైపు, కరువు, పురుగులు, వ్యాధులను నిరోధించగలిగే సామర్థ్యం కలిగిన హైబ్రిడ్ వరి వంగడాలను అభివృద్ధిపై చైనాలో ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.