బీజింగ్: చైనాలో జనాభా తగ్గుతోంది. గత ఏడాది జనాభా గణనీయంగా తగ్గినట్లు అధికారులు ప్రకటించారు. గడిచిన 60 ఏళ్లతో పోలిస్తే గత ఏడాదిలె తొలిసారి జనాభా సంఖ్య తగ్గినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన డేటాను కూడా అధికారులు వెల్లడించారు. సుమారు 140 కోట్ల జనాభా ఉన్న చైనాలో ప్రస్తుతం జనన రేటు తగ్గినట్లు అంచనాకు వచ్చారు. దీని వల్ల ఆర్థిక ప్రగతిపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
2020 చివరి నాటికి చైనా జనాభా 141750000గా ఉన్నట్లు అంచనా వేశారు. బీజింగ్‌లోని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఈ రిపోర్ట్‌ను రిలీజ్చేసింది. అంతకముందు ఏడాదితో పోలిస్తే జనాభా 8,50,000 తగ్గినట్లు తేల్చారు. గత ఏడాది చైనాలో సుమారు 95 లక్షల మంది జన్మించినట్లు ఎన్బీఎస్ పేర్కొన్నది. ఇక మరణించినవారి సంఖ్య కోటి 4 లక్షలు ఉన్నట్లు తెలిపారు.
గతంలో 1960లో చైనాలో జనాభా తగ్గింది. అప్పట్లో మావో అమలు చేసిన వ్యవసాయ విధానం ఆ దేశంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో చైనా ఆధునిక చరిత్రలోనే ఆ రోజుల్లో తీవ్ర కరువు వచ్చింది. ఆ తర్వాత జనాభా వేగంగా పెరిగినా.. 1980 దశకంలో వన్ చైల్డ్ పాలసీని ప్రవేశపెట్టారు. అధిక జనాభా కలుగుతుందన్న భయంతో అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. జనాభాను పెంచేందుకు ఇటీవల ఒక జంటకు ముగ్గురు సంతానం ఉంచవచ్చు అని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.