న్యూయార్క్: చైనా వ్యాపారవేత్త, టైకూన్(China Tycoon) గువో వెన్గుయి.. అమెరికా కోర్టులో దోషిగా తేలారు. బిలియన్ డాలర్ల స్కామ్‌లో అతను తన ఆన్లైన్ ఫాలోవర్లను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 12 క్రిమినల్ కేసుల్లో అతను తొమ్మిదింటిలో దోషిగా రుజువయ్యాడు. అతనిపై రాకటేరింగ్, ఫ్రాడ్, మనీల్యాండరింగ్ కేసులు ఉన్నాయి. నవంబర్ 19వ తేదీ ఈ కేసులో శిక్షను ప్రకటించనున్నారు. వెన్గుయికి దశాబ్ధాల పాటు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు జిల్లా జడ్జీ అనలిసా టోర్రెస్ తెలిపారు. 2023 మార్చిలో అతన్ని అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను జైల్లోనే ఉంటున్నాడు.
సోషల్ మీడియాలో ఫాలోఅవుతున్న వారికి క్రిప్టోకరెన్సీ ఇన్వెస్ట్మెంట్ గురించి 2018 నుంచి 2023 వరకు హామీ ఇచ్చాడని, దాని ద్వారా సుమారు వంద కోట్ల డాలర్ల డబ్బును సేకరించాడని, చైనా ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసేందుకు ఆ డబ్బును వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మొఘల్‌గా గుర్తింపు ఉన్న వెన్గుయి.. ఆన్లైన్ ఫాలోవర్ల నుంచి సేకరించిన సొమ్మును లగ్జరీ వస్తువులు ఖరీదు చేసేందుకు వాడినట్లు తెలుస్తోంది. న్యూజెర్సీలో భవంతి, రెడ్ లాంబోర్గిని కొన్నట్లు ఆరోపనలు ఉన్నాయి.
చైనా కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకి అయిన వెన్గుయి.. ట్రంప్ వద్ద చీఫ్ స్ట్రాటజిస్ట్‌గా చేసిన స్టీఫెన్ బానన్‌కు దగ్గరి మిత్రుడు. గున్వెయికి అనేక పేర్లు ఉన్నాయి. ఆయన్ను రకరకాలుగా పిలుస్తుంటారు. కేసు నమోదు చేసినప్పుడు అతని పేరును హో వాన్ కివోక్గా రాశారు. ఆన్లైన్ ఫాలోవర్లను మోసం చేసి.. గున్వెయి సంపన్న జీవితాన్ని గడిపినట్లు మన్హటన్ అటార్నీ డామియన్ విలియమ్స్ తెలిపారు.