China | బీజింగ్, ఏప్రిల్ 20 : దక్షిణ చైనా సముద్ర జలాలపై ఆధిపత్యం కోసం తపిస్తున్న చైనా.. హైడ్రోజన్ బాంబ్ (నాన్-న్యూక్లియర్)ను విజయవంతంగా పరీక్షించింది. తైవాన్‌కు అమెరికా రక్షణ మద్దతు పెరుగుతున్న క్రమంలో ఆ దేశం హైడ్రోజన్ బాంబు పరీక్షలను చేపట్టినట్టు తెలుస్తున్నది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, పూర్తిగా శుద్ధి చేసిన 2 కిలోగ్రాముల హైడ్రోజన్ బాంబును ఆ చైనా స్టేట్ షిప్‌బిల్డింగ్ కార్పొరేషన్ అనే సంస్థ అభివృద్ధి చేసింది.
సంప్రదాయ అణు బాంబుల మాదిరిగా కాకుండా మెగ్నీషియం హైడ్రేడ్తో ఈ నాన్-న్యూక్లియర్ హైడ్రోజన్‌ను తయారుచేసింది. ఇది చాలా శక్తివంతమైన బాంబు. ఒక్కసారి యాక్టివేట్ అయితే, కేవలం రెండు సెకన్లలో 1,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో కూడిన పేలుడు సంభవిస్తుంది. ఒకేవిధమైన శక్తిని విడుదల చేసే ఫైర్‌బాల్స్ విడుదలవుతూ.. వరుస పేలుళ్లు సంభవిస్తాయి. దీంతో విస్తారమైన ప్రదేశంలోని శత్రు సేనల్ని, వాటి స్థావరాల్ని ఇది సర్వనాశనం చేస్తుంది.