
బీజింగ్: కోవిడ్ నియంత్రణ కోసం చైనా కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నది. అయితే చిన్నపిల్లల దుస్తుల్ని డెలివరీ చేస్తున్న సమయంలో కోవిడ్ వ్యాప్తిస్తున్నట్లు గుర్తించారు. హెబేయ్ ప్రావిన్సులో ఓ క్లాతింగ్ మార్కెట్లో ముగ్గురు కార్మికులకు కొత్తగా కరోనా సోకింది. దీంతో ప్రభుత్వాధికారులు జాగ్రత్తలు పాటిస్తున్నారు. దుస్తుల కంపెనీల నుంచి వెళ్తున్న అన్ని పార్సిళ్లను సరిగ్గా చెక్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. వీలైతే కరోనా టెస్టింగ్ నిర్వహించాలన్నారు. హెబేయ్ ప్రావిన్సులో సుమారు 300 క్లాతింగ్ ప్యాకేజీలను టెస్ట్ చేశారు. జింగ్జీ, జిన్జావూ నగరాలకు వెళ్లాల్సిన పార్సిళ్లను నిలిపివేశారు. ఫ్రిజ్లో నిలువ చేసే ఆహారాన్ని కూడా ఇప్పటికే చైనా టెస్టింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వార్షిక ఆన్లైన్ షాపింగ్ సీజన్ మొదలైన నేపథ్యంలో క్లాతింగ్ పార్సిళ్లపై దృష్టి పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు.