రోదసిలోకి ఇబ్బడిముబ్బడిగా ఉపగ్రహాలు
బీజింగ్, అక్టోబర్ 3: చైనాలోని ఈశాన్య రాష్ట్రం జిలిన్లో ఉన్న చాంగ్చున్ యూనివర్సిటీలో ఇటీవల ఓ కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో వేలాదిమంది విద్యార్థులు పసుపు, ఎరుపు రంగు కార్డులను పట్టుకొని వర్సిటీ గ్రౌండ్లో నిలబడ్డారు. దీన్ని 650 కిలోమీటర్ల మీద భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న జిలిన్-1 స్పెక్ట్రమ్ అనే ఉపగ్రహం చిత్రీకరించింది. కేవలం ఇలాంటి కార్యక్రమాలను రోదసి నుంచి చిత్రీకరించడానికే పదుల సంఖ్యలో ఉపగ్రహాలను చైనా అంతరిక్షంలోనికి ఇబ్బడిముబ్బడిగా పంపిస్తున్నది. 2030 నాటికి వందకుపైగా ఇలాంటి ఉపగ్రహాలను పంపించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో భూమి మీద ప్రతి అంగుళంపై పది నిమిషాలకొకసారి నిఘాను పెట్టాలని డ్రాగన్ ఉద్దేశం. అయితే, భూకక్ష్యలో ఉపగ్రహాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ, అంతరిక్ష వ్యర్థాలు పేరుకుపోతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.