బీజింగ్: చైనా, అమెరికా మధ్య పరోక్ష యుద్ధం నడుస్తోంది. చాన్నాళ్లుగా రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రెండు అగ్రదేశాల మధ్య ప్రచ్ఛన్నంగా అంతరిక్ష యుద్ధం మొదలైన్నట్లు అర్థమవుతోంది. అమెరికా బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రాజెక్టుపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మస్క్‌కు చెందిన స్పేస్ రాకెట్ల వల్ల .. తమ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి ముప్పువాటిల్లినట్లు చైనా ఆరోపిస్తోంది. దీంతో డ్రాగన్ దేశంలోని సోషల్ మీడియాలో మస్క్‌కు వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం సాగుతోంది.
యూఎన్ స్పేస్ ఏజెన్సీకి ఫిర్యాదు..
స్టార్‌లింక్ ప్రయోగించిన శాటిలైట్ల వల్ల రెండుసార్లు తమ స్పేస్ స్టేషన్‌కు ప్రమాదం తప్పినట్లు చైనా ఆరోపించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన స్పేస్ ఏజెన్సీ వద్ద డ్రాగన్ తన ఫిర్యాదును నమోదు చేసింది. అయితే ఈ ఫిర్యాదులపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఓనర్ మస్క్ గురించి చైనీయులకు బాగా తెలుసు. కానీ తాజా ఘటనతో ఆయనపై ఆ దేశంలో అయిష్టత వ్యక్తం అవుతోంది. జూలై ఒకటో తేదీన, అక్టోబర్ 21వ తేదీల్లో స్టార్‌లింక్ శాటిలైట్లు.. తమ స్పేస్ స్టేషన్‌ను ఢీకొనబోయినట్లు చైనా ఆరోపించింది. అయితే రక్షణాత్మక చర్యలు చేపట్టి.. శాటిలైట్ల నుంచి ప్రమాదాన్ని తప్పించినట్లు తన డాక్యుమెంట్లో యూఎన్‌కు చైనా తెలిపింది. ఇప్పటి వరకు స్పేస్ఎక్స్ సంస్థ దీనిపై అధికారక ప్రకటన ఏదీ చేయలేదు.
డ్రాగన్ నెటిజెన్ల ఆగ్రహం..
తమ అంతరిక్ష కేంద్రానికి ప్రమాదం తప్పినట్లు చైనా ప్రకటన చేయగానే.. ఆ దేశానికి చెందిన నెటిజెన్లు మస్క్, స్టార్‌లింక్, అమెరికాపై తీవ్ర విమర్శలు కురిపించారు. స్టార్‌లింక్ శాటిలైట్లు అంతరిక్షంలో ఓ చెత్త కుప్పలా తయారైనట్లు కొందరు ఆరోపించారు. అంతరిక్ష యుద్ధ ఆయుధాలుగా అమెరికా శాటిలైట్లను ప్రయోగిస్తున్నట్లు విమర్శించారు. అమెరికా ప్రభుత్వం తయారు చేసిన కొత్త ఆయుధం మస్క్ అని కొందరన్నారు. స్టార్‌లింక్ ఆగడాలను మెల్లమెల్లగా బయటపెడుతున్నామని, వాటికి అమెరికా మూల్యం చెల్లించక తప్పదన్నారు. అయితే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అమెరికాను కోరినట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ తెలిపారు.
30 వేల శాటిలైట్లు..
ప్రస్తుతం అంతరిక్షంలో సుమారు 30 వేల ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. వాటి వల్ల ఆకాశంలో చెత్త తయారైనట్లు శాస్త్రవేత్తలు ఆరోపిస్తున్నారు. అంతరిక్షంలో శాటిలైట్లు ఢీకొనడం తప్పదని వాళ్లు ముందు నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. శాటిలైట్లకు చెందిన సమాచారాన్ని ప్రభుత్వాలు వెల్లడించాలని శాస్త్రవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. స్టార్‌లింక్ నెట్‌వర్క్‌లో భాగంగా ఇప్పటికే స్పేస్ ఎక్స్ సంస్త సుమారు 1900 శాటిలైట్లను నింగిలోకి పంపింది. ఇంకా వేల సంఖ్యలో శాటిలైట్లను ప్రయోగించాలని ఆ సంస్థ ప్లాన్ వేస్తోంది. గత నెలలో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో కూడా శిథిలాల వల్ల ప్రమాదం ఉందని తెలిసి స్పేస్‌వాక్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే.