China Robot : చైనా (China) లోని తియాన్జిన్ (Tianjin) వేదికగా షాంఘై సహకార సదస్సు (SCO) జరుగుతోంది. ఆ సదస్సులో ఉంచిన ఓ హ్యుమనాయిడ్ రోబో (Humanoid Robot) అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ రోబోను ఓ జర్నలిస్టు ప్రశ్నలు అడుగగా తనదైన శైలిలో సమాధానాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపర్చింది. ఓ టీవీ ఛానల్‌తో ఎస్సీవో సదస్సుకు సంబంధించిన ఆసక్తికర అంశాలను పంచుకుంది.
చైనా రూపొందించిన ఆ రోబో స్త్రీ రూపంలో ఉంది. యూజర్లు అడిగిన ప్రశ్నలకు ఆ రోబో ఇంగ్లిష్, రష్యన్, చైనీస్ భాషల్లో సమాధానాలు చెప్పింది. జర్నలిస్టు రోబోను ప్రశ్నించడానికి సిద్ధమవగానే.. ‘నా గరిష్ఠ సామర్థ్యంతో ఈ రోజు పని చేస్తున్నాను. నన్ను ప్రశ్నలు అడుగుతున్నందుకు ధన్యవాదాలు’ అంటూ సమాధానాలు ఇచ్చేందుకు ఆసక్తి కనబర్చింది.
భారత్ గురించి ఆలోచనలు పంచుకోమని కోరగా.. ‘నేను ఏఐ సేవలు అందించే రోబోను. దేశాలు, రాజకీయాలపై నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పలేను’ అని జవాబిచ్చింది. దాంతో అక్కడే ఆ రోబోను ఆసక్తిగా చూస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఘొల్లున నవ్వారు.
అయితే ఎస్సీవో సదస్సుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించింది. ఆ సదస్సుకు చెందిన ప్రత్యేకతలను వివరించింది. కాగా చైనాలో ఎస్సీవో సదస్సు జరుగుతోంది. సదస్సు కోసం చైనాకు వెళ్లిన ప్రధాని మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఇరుదేశాలకు సంబంధించిన అంశాలపై మోదీ, జిన్‌పింగ్ చర్చించారు.
కాగా ఎస్సీవో సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా పలు దేశాల అధినేతలు హాజరయ్యారు. వారంతా గ్రూప్ ఫొటో దిగారు. తద్వారా తామంతా పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నామనే సందేశం ఇచ్చారు. ఈ సదస్సుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు సోమవారం నుంచి మొదలైయ్యాయి.