బీజింగ్: చైనాలో (China) మంత్రుల తొలగింపు కొనసాగుతున్నది. ఇప్పటికే రక్షణ మంత్రిని తొలగించిన డ్రాగన్ ప్రభుత్వం.. తాజా మరో ఇద్దరు మంత్రులపై వేటువేసింది. రెండు నెలలుగా కనిపించకుండా పోయిన రక్షణ మంత్రి లీ షాంగ్ఫూను (Li Shangfu) ప్రభుత్వం ఆ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్థిక మంత్రి లియు కున్ (Finance Minister Liu Kun), సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వాంగ్ జిగాంగ్లను (Science and Technology Minister Wang Zhigang) తొలగించింది. వారి స్థానంలో ఆర్థిక మంత్రిగా లాన్ ఫొఆన్, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా యిన్ హెజున్ను నియమించింది. అయితే వారి తొలగింపునకు గల కారణాలు ఏంటనే విషయం వెల్లడించలేదు.
సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రిగా 2012, జూలై వాంగ్ నియమితులయ్యారు. అనంతరం 2018లో క్యాబినెట్ మంత్రి హోదా పొందారు. కాగా, గత మార్చి నెలలో రక్షణ శాఖ మంత్రిగా నియమితులైన లీ షాంగ్ఫూను ప్రభుత్వం తొలిగించింది. ఆగస్టు 29న ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. గతంలో ఇదే విధంగా అదృశ్యమైన విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ను జూలైలో ఆ పదవి నుంచి తొలగించారు. వీరిద్దరి తొలగింపునకు కారణాలను వెల్లడించలేదు. జిన్పింగ్ అధికారాన్ని వీరిద్దరూ ప్రశ్నించినట్లు తెలుస్తున్నట్లు తెలుస్తున్నది.