చైనాకు చెందిన 54 యాప్స్‌ను భారత ప్రభుత్వం తాజాగా నిషేధించిన విషయం తెలిసిందే. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయని పేర్కొంటూ భారత్ ఈ యాప్స్‌ను నిషేధించింది. ఈ అంశంపై డ్రాగన్ స్పందించింది. చైనాతో సహా విదేశీ పెట్టుబడిదారులందర్నీ భారత ప్రభుత్వం ఒకేలా చూస్తుందని, అందరి పట్లా పారదర్శకతతోనే వ్యవహరిస్తుందని తాము నమ్ముతున్నట్లు పేర్కొంది. అలాగే ఎవరిపైనా వివక్షత కూడా చూపదని తాము విశ్వసిస్తున్నట్లు చైనా వాణిజ్యశాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వున్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలు మరింత పరిపుష్టం కావడానికి భారత ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలకు పూనుకుంటుదని తాము భావిస్తున్నట్లు గావో ఫెంగ్ పేర్కొన్నారు.
దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయన్న కారణంతో భారత ప్రభుత్వం తాజాగా చైనాకు చెందిన 54 యాప్స్‌పై నిషేధం విధించింది. యూజర్లకు చెందిన డేటాను ఈ యాప్స్ చైనా ప్రభుత్వానికి అందజేస్తున్నాయన్నది భారత ప్రభుత్వం ప్రధాన ఆరోపణ. పాపులర్ గేమ్ అయిన గరైనా ఫ్రీఫైర్ ఇల్యూమినేట్తో పాటు మరిన్ని యాప్స్‌ను భారత్ నిషేధించింది.