
Xi Jinping | చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు సర్వాధికారాలు కట్టబెడుతూ అధికార చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) నిర్ణయం తీసుకున్నది. బీజింగ్‌లో సోమవారం నుంచి నాలుగు రోజులు జరిగిన సీపీసీ ప్లీనరీ సమావేశం ఈ మేరకు కీలక తీర్మానాన్ని ఆమోదించింది. శతాబ్ధకాల పార్టీ పోరాటంలో సాధించిన ప్రధాన విజయాలు.. చారిత్రక అనుభవాలు అనే పేరుతో రూపొందించిన తీర్మానానికి ఆమోదముద్ర వేసింది. సీపీసీ వందేండ్ల చరిత్రలో ఆమోదించిన తీర్మానాల్లో ఇది మూడవది.
తొలుత సీపీసీ వ్యవస్థాపక నేత మావో జెడుంగ్ హయాంలో 1945లో, సోషలిస్టు చైనాలోకి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన డెంగ్ జియావో పింగ్ హయాంలో 1981లో ఇటువంటి తీర్మానాలు ఆమోదించారు. చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా.. పార్టీ చరిత్రలో సరైన వైఖరిని ఈ తీర్మానం ప్రతిబింబిస్తున్నదని వ్యాఖ్యానించింది. దీంతో వచ్చే ఏడాది దేశాధ్యక్షుడిగా ఆయన ఎన్నికకు మార్గం సుగమం అయినట్లే. మావో జెడుంగ్, డెంగ్ జియావో పింగ్ తర్వాత చైనాలో జీ జిన్‌పింగ్ అత్యంత శక్తిమంతమైన నేతగా నిలువనున్నారు.
ఈ తీర్మానంలో సీపీసీ తొలి చైర్మన్ మావో జెడుంగ్ పేరు ఏడు సార్లు.. ఆర్థిక సంస్కరణలతో సోషలిజాన్ని కొత్త పుంతలు తొక్కిన డెంగ్ జియావో పింగ్ పేరు ఐదు సార్లు.. తాజా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పేరు ఏకంగా 17 సార్లు ప్రస్తావించారు. దీంతో అష్టకష్టాలు పడి.. కొమింటాంగ్ ప్రభుత్వంతో పోరాడి సోషలిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మావో.. సోషలిస్టు చైనాను ఆర్థిక సంస్కరణల బాట పట్టించిన డెంగ్ కంటే జిన్‌పింగ్ శక్తిమంతుడా.. అని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.
హాంకాంగ్ బాప్టిస్ట్ యూనివర్సిటీ ప్రతినిధి జీన్ పేర్రె కేబ్స్టాన్ స్పందిస్తూ.. గతాన్ని తిరగరాస్తూ.. జిన్‌పింగ్‌తో భవితవ్యాన్ని ముడివేస్తూ ఈ తీర్మానం రూపొందించారన్నారు. ఇప్పటికే అసమ్మతి వాదులను, పార్టీలో తన వ్యతిరేకులపై ఉక్కుపాదం మోపుతూ జీ జిన్‌పింగ్ పాలన సాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.