బీజింగ్: కమ్యూనిస్ట్ దేశం చైనాలో ముస్లింలపై అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడి ముస్లిం సాంప్రదాయ గ్రూపులకు చెందిన మహిళలు వాట్సాప్, జీమెయిల్ అకౌంట్ వంటివి వాడితే.. వారిపై సైబర్ క్రైమ్స్ చేస్తారన్న ముద్ర వేసి నిర్బంధిస్తోంది. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిని ప్రి-క్రిమినల్స్‌గా అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇన్ ద క్యాంప్స్: చైనాస్ హైటెక్ పీనల్ కాలనీ పేరుతో మంగళవారం విడుదలైన పుస్తకం ఈ సంచలన విషయాలు బయటపెట్టింది. దీనికి వేరా ఝౌ అనే ఓ విద్యార్థిని ఉదంతాన్ని నిదర్శనంగా చూపించింది.
ఈమె యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్టూడెంట్. చైనాలో తన స్కూల్ హోమ్‌వర్క్‌ను పంపించడానికి జీమెయిల్ అకౌంట్‌కు లాగిన్ కోసం వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ను వాడినందుకు ఆమెను నిర్బంధించారు. ఆమెను రీ-ఎడ్యుకేషన్ క్లాస్‌కు పంపించారు. ఈ ఘటన 2018లో జరిగింది. ఆరు నెలల పాటు ఆమె ఆ క్యాంప్‌లోనే గడిపింది. బయటకు వచ్చిన తర్వాత కూడా తన వీధిలో తిరుగుతున్న సమయంలో అక్కడి మానిటర్లు ఆమెను ముస్లిం ప్రి-క్రిమినల్‌గా చూపించడం గమనార్హం. అమెరికా పౌరసత్వం కూడా ఉన్న ఆమె చివరికి 2019లో ఎలాగోలా ఆ దేశానికి వెళ్లిపోయింది.
క్యాంప్‌లలో 10 లక్షల మంది
చైనాలోని క్యాంప్‌లలో ఇలా 10 లక్షల మంది ఉయ్ఘర్లు, ఇతర ముస్లిం గ్రూపులకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు అక్కడి హక్కుల సంఘాల వాళ్లు వెల్లడించారు. వీళ్లతో బలవంతంగా కూలీ పనులు చేయిస్తున్నారని వాళ్లు ఆరోపించారు. ఝౌతోపాటు మరో 11 మంది ముస్లిం మహిళలను చైనా అధికారులు అక్కడి ఇంటర్నెట్ సెక్యూరిటీ చట్టం కింద ప్రి క్రిమినల్స్‌గా ముద్ర వేశారు. ఈ చట్టం ప్రకారం అక్కడి ఇంటర్నెట్ ఆపరేటర్లు వ్యక్తిగత డేటాను కూడా చైనా అధికారులతో పంచుకోవాలి. ఇలా వాట్సాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నందుకు ఓ మహిళను, తన ఐడీతో సిమ్ కార్డులు యాక్టివేట్ చేసుకున్న మరో మహిళను నిర్బంధించారు. చైనాలోని హైటెక్ నిఘా వ్యవస్థ వల్ల అక్కడి ముస్లిం మహిళలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఈ తాజా పుస్తకం వివరించింది.