China | బీజింగ్, జనవరి 10: అంతరిక్ష, పునరుత్పాదక ఇంధన రంగంలో చైనా ఓ భారీ ప్రాజెక్టును చేపట్టబోతున్నది. రాత్రి, పగలుతో సంబంధం లేకుండా అంతరిక్షంలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని భావిస్తున్నది. ఇందుకోసం భూమికి 32 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో కిలోమీటరు పొడవునా సౌరఫలకలను ఏర్పాటు చేయనుంది.
తద్వారా నిరంతరం సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయనుంది. భూమిపై ఉన్న సౌరఫలకాలు కేవలం సూర్యరశ్మి ఉన్నప్పుడే విద్యుత్తును ఉత్పత్తి చేయగలవు. రాత్రి వేళల్లో, మేఘాలు ఉన్నప్పుడు విద్యుత్తు ఉత్పత్తి కాదు. అంతరిక్షంలో నిర్మించే ఈ సౌర విద్యుత్తు కేంద్రంలో మాత్రం భూవాతావరణం, రాత్రి పగలుతో సంబంధం లేకుండా నిరంతరాయంగా విద్యుత్తును ఉత్పత్తి చేయగలదని శాస్త్రవేత్త లాంగ్లేహావో తెలిపారు. ఈ ప్రాజెక్టును త్రీగోర్జెస్ డ్యామ్ ఆఫ్ స్పేస్ అని పిలుస్తున్నారు.