China | బీజింగ్: చైనాలో యువతీ, యువకులు వివాహ బంధంలో ప్రవేశించడానికి విముఖంగా ఉన్నారు. ఒకప్పుడు జనాభాను తగ్గించేందుకు కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడు పిల్లల్ని కన్నవారికి ప్రోత్సాహకాలు ఇస్తామన్నా యువత పట్టించుకోవడం లేదు. దీంతో జననాల రేటు పతనమవుతుండగా, వృద్ధుల రేటు పెరిగిపోతున్నది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో కేవలం 34 లక్షల జంటలు మాత్రమే వివాహం చేసుకున్నాయని, గత ఏడాది ఇదే కాలంలో 38.98 లక్షల జంటలు ఒక్కటయ్యాయని ఆ దేశ అధికారులు చెప్పారు.
ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాతే పెండ్లి చేసుకోవాలని యువత భావిస్తుండటం పెద్ద సమస్యగా మారిందని వారు ఆందోళన చెందుతున్నారు. పెండ్లిండ్ల సంఖ్య 2014 నుంచి క్రమంగా తగ్గుతున్నదని, కొవిడ్-19 మహమ్మారి తర్వా త మరింత పతనమవుతున్నదని చైనా ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని, పెండ్లి చేసుకున్నవారికి, పిల్లలకు జన్మనిచ్చినవారికి ప్రోత్సాహకాలను ప్రకటించిందని అధికారులు చెప్పారు.