న్యూఢిల్లీ : హొర్ముజ్ జలసంధిపై దిగ్బంధనం విధించడంపై అమెరికాకు చైనా గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్‌తో చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని కూడా అమెరికాను చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ హెచ్చరించారు. ఇరాన్‌తో తమకు వాణిజ్య, ఇంధన ఒప్పందాలు ఉన్నాయని, తమ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోరాదని తాము ఆశిస్తున్నామని జున్ మంగళవారం చెప్పారు. హొర్ముజ్ జలసంధి చైనాకు తెరిచే ఉందని, ఉంటుందని ఆయన అన్నారు. అమెరికా ఆంక్షలకు గురైన చైనాకు సంబంధించిన ఒక ట్యాంకర్ మంగళవారం హొర్ముజ్ జలసంధిని దాటింది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా సైన్యం దిగ్బంధనం ప్రారంభించిన తర్వాత ఈ ఇంధన కీలక మార్గం గుండా ప్రయాణించిన తొలి నౌకలలో ఇది ఒకటిగా నిలిచింది.
ట్రంప్ బెదిరింపులను సైతం లెక్కచేయకుండా చైనా నౌక హొర్ముజ్‌ను దాటడం, అమెరికాపై విమర్శలు గుప్పించడానికి ఇరాన్‌కు ఆయుధంగా మారింది. ట్రంప్ భయపడని దేశాలకు మాత్రమే ఈ దిగ్బంధనం వర్తిస్తుందని ఇరాన్ వ్యాఖ్యానించింది. సముద్ర ట్రాఫిక్ డాటా ప్రకారం మధ్యశ్రేణి ట్యాంకర్ అయిన రిచ్ స్టారీ హొర్ముజ్‌ను విజయవంతంగా దాటిన తర్వాత ప్రస్తుతం ఒమన్ గల్ఫ్‌లో ఉంది. పాకిస్థాన్‌లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన తర్వాత ఇరాన్ పోర్టుల్లోకి ప్రవేశించే లేదా బయలుదేరే నౌకలను అమెరికా అడ్డుకోవడం ప్రారంభిస్తుందని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.