Condom tax : జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా (China) జననాల రేటు (Birth rate) ను పెంచేందుకు అనేక చర్యలు చేపడుతోంది. పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తూ ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తోంది. తాజాగా కండోమ్ సహా గర్భనిరోధక సాధనాలు (Contraceptive), ఔషధాలపై పన్నులు బాదాలని నిర్ణయించింది. జనాభా పెంపునకు సంబంధించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గత మూడు దశాబ్దాల్లో ఇదే తొలిసారి.
కొత్తగా సవరించిన విలువ ఆధారిత పన్ను చట్టం ప్రకారం.. గర్భనిరోధక సాధనాలు సహా పలు వస్తువులపై 13 శాతం పన్ను విధించనున్నారు. కుటుంబ నియంత్రణ కఠినంగా అమలు చేసిన 1993 నుంచి వీటిపై పన్ను మినహాయింపు కొనసాగుతోంది. తాజాగా దీనిని ఎత్తివేసేందుకు చైనా సిద్ధమైంది. అదే సమయంలో పిల్లల సంరక్షణ సేవలు, వృద్ధుల సంరక్షణ, వికలాంగుల సేవలు, వివాహ సంబంధిత సేవలపై పన్ను మినహాయింపు ఇవ్వనుంది.
తద్వారా కాబోయే తల్లిదండ్రులకు పన్ను ఊరట కలిగించాలని చైనా ప్రభుత్వం ఉద్దేశంగా తెలుస్తోంది. వచ్చే జనవరి నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నట్లు సమాచారం. వీటితోపాటు పిల్లల సంరక్షణకు నగదు ప్రోత్సాహకాలు అందించడం, పితృత్వ, ప్రసూతి సెలవులను పెంచడం, గర్భస్రావాలను తగ్గించడం వంటి చర్యలనూ చేపడుతోంది. వీటికి సంబంధించి మార్గదర్శకాలు జారీచేసినట్లు సమాచారం.