బీజింగ్: తమ దేశం పేదరికాన్ని జయించిందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 2021లో గొప్పలు పోయారు. తమ దేశంలో పేద ప్రజలు ఎవరూ లేరని అన్నారు. అయితే ఆ దేశంలో వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. చాలా మంది ప్రజలు పేదరికంతో (China Poverty) బాధపడుతున్నారు. అనేక మంది దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. ఆర్థిక అవకాశాలు మసకబారడంతో భవిష్యత్తు గురించి చైనా ప్రజల్లో ఆందోళన పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పేదరికంతో బాధపడుతున్న ప్రజలు తమ గోడును బహిరంగంగా వెల్లడిస్తున్నారు. కూడు కోసం అల్లాడిపోతున్నట్లు వాపోతున్నారు. అయితే చైనా పేదరికాన్ని కళ్లకు గట్టే ఈ వీడియోలను ఆ దేశ అధికారులు ఆన్లైన్ నుంచి తొలగిస్తున్నారు.
ఇటీవల చైనాకు చెందిన ఒక వృద్ధురాలు తాను పడుతున్న కష్టాలను వెల్లడించింది. మాజీ ఉద్యోగిని అయిన ఆమెకు నెలకు అందే వంద యువాన్ల (సుమారు రూ.1,182) పెన్షన్‌తో తినడానికి ఏం కొనగలనంటూ వాపోయింది. చాలా కష్టంగా జీవితం గడుపుతున్నట్లు కన్నీరు పెట్టుకుంది. అయితే ఆ వృద్ధురాలి దుర్భర పేదరికాన్ని బయటపెట్టిన చైనా యువకుడి వీడియోను ఆన్‌లైన్‌తోపాటు సోషల్ మీడియా నుంచి చైనా అధికారులు తొలగించారు. అతడి సోషల్ మీడియా ఖాతాలను కూడా నిలిపివేశారు.
కాగా, చైనాకు చెందిన ఒక గాయకుడు ఆ దేశంలోని పేదరికాన్ని తన పాట ద్వారా వినిపించాడు. ‘నేను ప్రతిరోజూ నా ముఖం కడుక్కుంటాను. కానీ నా ముఖం కంటే నా జేబు శుభ్రంగా ఉంది’ అని తన ఆర్థిక పరిస్థితిని ఆ పాటలో తెలియజేశాడు. చైనాను పునరుజ్జీవింపజేయడానికి తాను కాలేజీకి వెళ్లానని, భోజనం కోసం కాదని అందులో పేర్కొన్నాడు. అయితే ఆ గాయకుడి పాటను చైనా నిషేధించింది. అలాగే అతడి సోషల్ మీడియా ఖాతాలను అధికారులు సస్పెండ్ చేశారు.
మరోవైపు 2022లో చైనాలోని ఒక వలస కార్మికుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే తన కుటుంబం కోసం అతడు అధికంగా శ్రమించినట్లు ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. చైనాలో అత్యంత కష్టపడి పనిచేసే వ్యక్తిగా పేరు తెచ్చుకున్న అతడి పట్ల సానుభూతి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి సంబంధించిన చర్చలపై చైనా అధికారులు సెన్సార్ విధించారు. అలాగే అతడి భార్యను జర్నలిస్టులు కలవకుండా నిరోధించారు. అతడి ఇంటి వద్ద పోలీసులను మోహరించారు.
సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేక వార్తలను చైనా బయటకు రానివ్వదు. ఇలాంటి వాటిపై ఎప్పటికప్పుడు ఒక కన్నేసి ఉంచుతుంది. వెంటనే వాటిని తొలగించడంతోపాటు నిషేధం విధిస్తుంది. దీంతో చైనా ప్రజల వాస్తవ పరిస్థితులు బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఇదే క్రమంలో చైనాలోని పేదరికం గురించి బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ఆ దేశం తాపత్రయం పడుతున్నదని అమెరికా మీడియా సంస్థ ‘ది న్యూయార్క్ టైమ్స్’ విమర్శించింది. ఈ నేపథ్యంలో పేదరికానికి సంబంధించిన వీడియోలను చైనా అధికారులు ఆన్లైన్ నుంచి తొలగిస్తున్నారంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. పేదరికాన్ని దాచేందుకు చైనా ప్రయత్నిస్తున్నదంటూ దుమ్మెత్తిపోసింది.