బీజింగ్ వింటర్ ఒలంపిక్స్ క్రీడల నడుమ ప్రపంచ రాజకీయాలు నడుస్తున్నాయి. రష్యా, చైనా, పాక్ ఈ మూడు దేశాలూ ఈ ఒలంపిక్స్ ఆటల మధ్య రాజకీయ ఆటలను కూడా ఆడేస్తున్నాయి. ప్రపంచ యవనికపై భారత్‌ను, అమెరికాను ఇరుకున పెట్టేందుకు ఈ మూడు దేశాలూ దగ్గరై, కొన్ని కీలక నిర్ణయాలే తీసుకున్నాయి. అందులో ఒకటి విద్యార్థుల విషయం. పాకిస్తానీ విద్యార్థులను తిరిగి చదువుల కోసం వెనక్కి పిలిచేందుకు చైనా సమ్మతించింది. కానీ.. భారతీయ విద్యార్థుల విషయంలో మాత్రం మోకాలడ్డుతోంది. భారతీయ విద్యార్థులను తిరిగి వెనక్కి పిలిచే విషయంలో మాత్రం చైనా ఓ క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖను ప్రశ్నించగా.. అడ్డదిడ్డంగా జవాబులిచ్చింది. పాకిస్తాన్, సింగపూర్, మంగోలియా, శ్రీలంక విద్యార్థులను చదువుల నిమిత్తమై తిరిగి వెనక్కి పిలవాలని డ్రాగన్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.
చైనాలో కోవిడ్ విజృంభణ కారణంగా విదేశీ విద్యార్థులను చైనా ఇప్పటి వరకూ అనుమతించలేదు. ఇప్పుడు కోవిడ్ నియంత్రణలో ఉన్న కారణంగా విదేశీ విద్యార్థులు తిరిగి చైనాకు రావడానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. భారతీయ విద్యార్థుల విషయంలో ఎలాంటి ప్రణాళికలు తీసుకున్నారని అడగ్గా…. తమ తమ చదువుల కోసం విదేశీ విద్యార్థులు తిరిగి చైనాకు రావడానికి ఓ పద్ధతి ప్రకారం ముందుకు సాగుతున్నాం. అయితే ఇవి ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేం. కోవిడ్ రూల్స్‌కు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. ఆరోగ్యకరంగా, సురక్షితంగా చైనాకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ పేర్కొన్నారు.
పాకిస్తాన్ విషయంలో సూటిగా స్పందించిన చైనా
పాకిస్తాన్ విద్యార్థులను తిరిగి అనుమతించే విషయంలో ఎలాంటి ఆలోచనలున్నాయని అడగ్గా.. చైనా గుక్కతిప్పుకోకుండా సూటిగా సమాధానమిచ్చింది. పాకిస్తాన్ విద్యార్థులు తిరిగి చైనాకు వచ్చే విషయంలో అన్ని ఏర్పాట్లను చేస్తామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ స్పష్టం చేశారు.
చైనా అధ్యక్షుడితో భేటీ అయిన పాక్ ప్రధాని
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాతే ఈ పరిణామం చోటు చేసుకుంది. పైగా చైనాను ప్రశంసలతో ముంచెత్తింది పాకిస్తాన్. విద్యాభ్యాసానికి చైనా ఎంతో ప్రసిద్ధి చెందిన దేశంగా మారిందని, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ పాకిస్తాన్ విద్యార్థులు తిరిగి చైనాకు వచ్చి చదువుకునేలా అన్ని చర్యలు చేపడుతోందని పాక్ సర్కార్ చైనాకు కితాబునిచ్చింది.