Robot Boxing | బీజింగ్, మే 26: చరిత్రలో తొలిసారిగా చైనాలో రోబోల బాక్సింగ్ టోర్నమెంట్ నిర్వహించారు. ‘యునిట్రీ రోబోటిక్స్’ సంస్థ తయారుచేసిన 1.32 మీటర్ల ఎత్తున్న జీ1 హ్యూమనాయిడ్ రోబో.. బాక్సింగ్ పోటీల్లో విజేతగా నిలిచింది. జిజియాంగ్ ప్రావిన్స్‌లోని హ్యాంగ్జౌ వేదికగా రోబోల బాక్సింగ్ పోటీలు నిర్వహించగా, బాక్సింగ్ రింగ్‌లో ఇద్దరు మనుషులు వలే రోబోలు కొట్టుకున్నాయి. ఒకదానిపై మరొటి ముష్టిఘాతాలు కురిపించుకున్నాయి.
మిషా ఫైటింగ్ సిరీస్.. పేరుతో నిర్వహించిన పోటీల్లో రోబోల బ్యాటరీ, ఇతర మెటీరియల్‌కు పరిమితులు విధించారు. ప్రత్యేకమైన ఈ టోర్నమెంట్లో నలుగురు మానవ ఆపరేటర్లు జట్లుగా ఏర్పడి.. రోబోలకు మార్గనిర్దేశం చేశారు. వేగవంతమైన పరిస్థితులలో రోబోల అధిక పీడన సామర్థ్యాలను, వాటి స్థితిస్థాపకతను పరీక్షించడానికి, చైనా ఏఐ శక్తిసామర్థ్యాల ప్రదర్శనకు ఈ పోటీ ఒక వేదికగా నిలిచింది.