బీజింగ్, డిసెంబర్ 2: జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా.. జననాల రేటు పెంచేందుకు దేశంలో కొత్తగా ‘కండోమ్ ట్యాక్స్’ను విధించబోతున్నది. వచ్చే ఏడాది జనవరి నుంచి కండోమ్‌లు సహా గర్భనిరోధక మందులు, పరికరాలపై 13శాతం విలువ ఆధారిత పన్ను వేయనున్నది. దీంతోపాటు పిల్లల్ని కనడానికి పలు ప్రోత్సాహకాల్ని కూడా జోడిస్తూ, విలువ ఆధారిత పన్ను చట్టానికి చైనా పలు సవరణలు చేసింది.
నర్సరీలు, కిండర్‌గార్డెన్ వంటి పిల్లల సంరక్షణ కేంద్రాలు, వయో వృద్ధుల సంరక్షణ, వికలాంగుల సేవా సంస్థలు, వివాహ సంబంధిత సేవలు అందిస్తున్న వ్యాపారాలపై వ్యాట్‌ను తొలగిస్తున్నది. చైనాలో ఒకే బిడ్డ విధానాన్ని రద్దు చేశాక 2024లో 95 లక్షల జననాలు నమోదయ్యాయి.