బీజింగ్ : చైనాలో కొవిడ్-19 కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతుండటంతో పలు సిటీల్లో ప్రజలకు ఉచితంగా యాంటీ ఫీవర్ డ్రగ్స్ అందిస్తున్నారు. జీరో కొవిడ్ పేరుతో కఠిన నియంత్రణలను సడలించిన అనంతరం చైనాలో అనూహ్యంగా కరోనా కేసులు ప్రబలుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. చైనా ఆస్పత్రుల్లో శవాల గుట్టలు పేరుకుపోయాయనే వార్తలతో ప్రపంచం ఉలిక్కిపడింది.
క్షేత్రస్ధాయి పరిస్ధితులు ఇలా ఉంటే డిసెంబర్ 21న వరుసగా రెండోరోజూ తాజా కొవిడ్ మరణాలు వెలుగుచూడలేదని చైనా అధికారికంగా వెల్లడించింది. మంగళవారం చైనాలో 3,89,306 కేసుల్లో కరోనా లక్షణాలు గుర్తించామని అధికార వర్గాలు తెలిపాయి. కరోనా నియంత్రణలను ఇటీవల సడలించిన నేపధ్యంలో టెస్టింగ్ తక్కువగా చేపట్టడంతో అధికార గణాంకాలను విశ్వసించలేమని నిపుణులు చెబుతున్నారు. క్రిస్మస్ వేడుకలతో పాటు కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ సందర్భంగా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
చైనాలో కరోనా నూతన వేరియంట్ వేగంగా ప్రబలుతుండటంతో ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. స్పెషల్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేయడంతో మందుల తయారీ, సరఫరాను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. మరోవైపు వైరస్ వ్యాప్తితో బీజింగ్, వుహాన్, షెంజెన్, షాంఘై నగరాల్లో స్ధానిక ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా యాంటీ ఫీవర్ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాయి.