బీజింగ్ : ప్రపంచంలో జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న చైనా.. జనాభాను మరింత పెంచడానికి కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రుల ఖాతాలలోకి ఒక్కో బిడ్డుకు ఏడాదికి 500 డాలర్ల (సుమారు రూ.43వేలు) నగదు బదిలీ చేసేందుకు ప్రణాళికలు రచించింది. పిల్లలకు మూడేండ్ల వయసు వచ్చే వరకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నట్టు చైనా ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు చైనా మంత్రివర్గం పరిశీలిస్తున్నదని ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ కథనం ప్రసారం చేసింది. పిల్లల పెంపకంలో భారాన్ని తగ్గించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొంది.
నిరుడు చైనాలో 90 లక్షల 54 వేల మంది జన్మించారు. ఈ సంఖ్య 2016లో జననాల్లో కేవలం సగమే మాత్రమే. చైనా ప్రభుత్వం 30 ఏండ్ల పాటు ఒకరే సంతానం ఉండాలన్న విధానాన్ని అమలు చేసి 2016లో రద్దు చేసింది. చాలా మంది పెండ్లిళ్లు చేసుకోవడం లేదని, పిల్లలను కనేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని, పెరుగుతున్న ఆర్థిక భారమే ఇందుకు కారణమని చైనా సర్కారు గుర్తించింది. ఈ క్రమంలో జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నది.