ఆస్టిన్, జూన్ 10: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. దశాబ్దాల క్రితం కనిపించకుండాపోయిన పాప.. కుటుంబసభ్యులకు ఇప్పుడు 42 ఏండ్ల వయసులో మనవళ్లతో కనిపించింది. 1980 అక్టోబర్లో తమ పాపతో సహా హరోల్డ్ డీన్, టీనా లిన్ దంపతులు డల్లాస్లో అనుమానాస్పదరీతిలో అదృశ్యమయ్యారు. 1981, జనవరిలో హ్యూస్టన్ తూర్పు గ్రామీణ ఏరియాలో కుక్క కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మనిషి అవయవంతో ఇంటికి రాగా, దీనిపై విచారణ, పరీక్షలు చేపట్టిన అధికారులు.. అవశేషాలు హరోల్డ్ దంపతులిగా గుర్తించారు. అయినప్పటికీ ఈ హత్య కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నది. పాపను ఓక్లహోమాకి చెందిన కుటుంబం దత్తత తీసుకుందని అధికారులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి పాప, ఇప్పటి 42 ఏండ్ల మహిళ తనను సొంత కుటుంబానికి పరిచయం చేసుకున్నది. తనకు పెండ్లి అయి ఐదుగురు పిల్లలు ఉన్నారని, ఇద్దరు మనమళ్లు కూడా ఉన్నారని వారికి తెలిపింది.