Cancer | న్యూయార్క్, డిసెంబర్ 11 : ప్రాణాంతక క్యాన్సర్‌కు సరికొత్త జన్యు చికిత్స విధానాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా(యూఎస్సీ)కి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ జన్యు చికిత్స ద్వారా శరీర రోగ నిరోధక వ్యవస్థకు నష్టం లేకుండా క్యాన్సర్‌కు చికిత్స అందించవచ్చని వీరు చెప్తున్నారు. ఎలుకలకు ప్రయోగాత్మకంగా ఈ కొత్త జన్యు చికిత్సను చేయగా, విజయవంతంగా క్యాన్సర్‌ను అంతం చేసింది.
ఇందుకు సంబంధించిన వివరాలు ‘నేచర్ కమ్యూనికేషన్స్’లో ప్రచురితమయ్యాయి. సీఆర్ఐఎస్పీఆర్ అనే విధానం ద్వారా క్యాన్సర్ బాధితులకు జన్యు చికిత్స అందిస్తారు. కాస్9 అనే ఎంజైమ్‌ను ఉపయోగించి ఈ విధానం ద్వారా జీన్ ఎడిటింగ్ చేసి క్యాన్సర్‌కు చికిత్స చేస్తారు. అయితే, ఇది శరీరంలో ఎప్పుడూ ఒకే చోట ఉండదు. దీని అవసరం తీరిన తర్వాత కూడా శరీరంలోని జన్యువులను ఎడిటింగ్ చేస్తూ ఉంటుంది. దీంతో రోగ నిరోధక శక్తికి నష్టం వాటిల్లుతుంది. ఈ సవాల్‌కు పరిష్కారంగా శాస్త్రవేత్తలు కొత్త సీఆర్ఐఎస్పీఆర్ విధానాన్ని తయారుచేశారు.
సిరల ద్వారా దీనిని రోగి శరీరంలోకి పంపిస్తారు. వేడి ద్వారా యాక్టివేట్ అయ్యేలా దీనిని రూపొందించారు. అల్ట్రాసౌండ్ ద్వారా వేడిని కలిగించి ఈ సీఆర్ఐఎస్పీఆర్ను యాక్టివేట్ చేసి జీన్ ఎడిటింగ్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఇది దానికదే పని చేయడం ఆగిపోతుంది. తద్వారా రోగ నిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం ఉండదు. కావాల్సినప్పుడు అల్ట్రాసౌండ్ ద్వారా మళ్లీ సీఆర్ఐఎస్పీఆర్ను యాక్టివేట్ చేయొచ్చు. దీని ద్వారా శరీరంలో ఎక్కడ అవసరం అయితే అక్కడ చికిత్స అందించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.