Prostate Cancer | లండన్ : ప్రొస్టేట్ క్యాన్సర్‌పై జరుగుతున్న పరిశోధనల్లో గొప్ప ముందడుగు పడింది. అల్ట్రాసౌండ్ చికిత్సలను ఉపయోగించటం ద్వారా సర్జరీ అవసరం లేకుండా..ప్రొస్టేట్ క్యాన్సర్‌ను సమర్థంగా అడ్డుకోవచ్చునని రైస్ వర్సిటీ, వాండర్బిల్ట్ వర్సిటీ పరిశోధకులు నిరూపించారు. క్యాన్సర్ చికిత్సలో వాడుతున్న ‘ట్రైల్’కు అల్ట్రాసౌండ్ (ఎఫ్యూఎస్)ను చేర్చటం ద్వారా క్యాన్సర్ కణతుల పరిమాణాన్ని తగ్గించవచ్చని వెల్లడించారు. దీనిపై ‘అడ్వాన్స్డ్ సైన్స్’ కథనం ప్రకారం ‘ట్రైల్’లో రోగులకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ.
ఈ చికిత్సలో రోగి తీవ్రమైన అసౌకర్యానికి గురవుతాడు. ట్రైల్‌కు ‘ఎఫ్యూఎస్’ను కూడా చేర్చినట్టయితే.. క్యాన్సర్ కణతుల పరిమాణం అనుకున్న విధంగా తగ్గిస్తున్నదని పరిశోధన తేల్చింది. ప్రొస్టేట్ క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉన్న కేసుల్లో ‘అల్ట్రాసౌండ్’ పద్ధతి చాలా బాగా పనిచేస్తుందని, క్లినికల్‌గా ఈ కొత్త పద్ధతి వినియోగంలోకి వస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.