న్యూఢిల్లీ: క్యాన్సర్‌కు చికిత్సలో యూనివర్సిటీ ఆఫ్ మిస్సిస్సిపి శాస్త్రవేత్తలు సరికొత్త పరిశోధనను తెరపైకి తెచ్చింది. సముద్రపు దోసకాయలుగా పిలువబడే జీవుల్లో ఉన్న చక్కెర కణాలు మనిషి శరీరంలో క్యాన్సర్ వ్యాప్తిని నిరోధిస్తాయని తేల్చి చెప్పారు. దీనిద్వారా సంప్రదాయ చికిత్సల మాదిరిగా శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని తెలిపారు.
ఈ జీవుల్లో ఉన్న ‘ఫ్యూకో సైలెటెడ్ కొండ్రోయిటిన్ సల్ఫేట్’ అనే రసాయనం క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుందని తమ పరిశోధనల ద్వారా సైంటిస్టులు తేల్చారు. భవిష్యత్‌లో క్యాన్సర్ చికిత్సలో ఇది కీలకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ బృందంలో జార్జ్‌టౌన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు కూడా ఉన్నారు.
ఈ సముద్రపు దోసకాయల్లోని చక్కెర కణాలు మనుషులకు ఎలాంటి హాని కలిగించవని, రక్తపోటు, రక్తం గడ్డ కట్టడం లాంటి సమస్యలు తలెత్తవని వెల్లడించాయి. అయితే ప్రస్తుతం ఈ బృందం సరికొత్త సవాలును ఎదుర్కొంటున్నది. ఈ సముద్రపు దోసకాయలు తగినంతగా అందుబాటులో లేకపోవడం కారణంగా ఇప్పటికిప్పుడు ఔషధంగా మార్చలేకపోతున్నట్టు సైంటిస్టులు వెల్లడించారు. దీనిపై విస్తృతంగా పరిశోధనలు చేస్తామని, ఇది విజయవంతమైతే క్యాన్సర్ చికిత్సలో మరో మైలురాయిగా మారబోతుందని సైంటిస్టులు చెప్తున్నారు.