రోమ్: జర్మనీ వెళ్లాల్సిన విమానాన్ని ఒక పిల్లి హైజాక్ చేసింది. (cat hijacks plane) దాని అరుపులు విన్న విమాన సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ పిల్లి వారిని ముప్పుతిప్పలు పెట్టింది. కీలకమైన ఎలక్ట్రిక్ బేలోకి అది వెళ్లింది. ఈ నేపథ్యంలో రెండు రోజులపాటు ఆ విమానం అక్కడి నుంచి కదలలేదు. ఇటలీ రాజధాని రోమ్‌లో ఈ సంఘటన జరిగింది. రైనైర్ ఎయిర్‌కు చెందిన విమానం గతవారం రోమ్ నుంచి జర్మనీకి టేకాఫ్ కావాల్సి ఉంది. అయితే ఎయిర్పోర్ట్ బేలో నిలిచి ఉన్న ఆ విమానంలో పిల్లి అరుపులు విని సిబ్బంది అప్రమత్తమయ్యారు. దాని కోసం అంతటా వెతికారు.
కాగా, కీలకమైన ఎలక్ట్రికల్ విభాగంలో దాక్కున్న ఆ పిల్లిని చివరకు గుర్తించారు. దానిని పట్టుకునేందుకు విఫలయత్నం చేశారు. కొన్ని ప్యానల్స్‌ను తొలగించారు. అయితే ఆ పిల్లి విమానంలో ఒక చోటు నుంచి మరోచోటుకు తిరిగింది. దీంతో అది ఎక్కడైనా చిక్కుకుని చనిపోతుందేమోనని, దీనివల్ల విమానానికి ప్రమాదం జరుగుతుందోమోనని సిబ్బంది ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని అక్కడే నిలిపివేశారు.
మరోవైపు రెండు రోజుల తర్వాత పిల్లి తాపీగా ఆ విమానం నుంచి బయటపడింది. తెరిచి ఉంచిన డోర్ నుంచి మెట్లమీదుగా కిందకు దిగింది. రన్‌వేపై నడిచి అక్కడి నుంచి పారిపోయింది. ఇది చూసి విమాన సిబ్బంది ఊరట చెందారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ విమానం రెండు రోజులు ఆలస్యంగా జర్మనీకి బయలుదేరింది.