Drugs Smuggling | కోస్టారికా: కోస్టారికా జైల్లో జరిగిన ఈ క్రైమ్ థిల్లర్‌ను ఎవరూ ఊహించి ఉండరు! పిల్లి ద్వారా ఏకంగా జైల్లో డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేయడం చూసి జైలు అధికారులు షాక్‌కు గురయ్యారు. పిల్లికి కట్టిన ప్లాస్టిక్ పొట్లాల్లో 230 గ్రాముల గంజాయి, 67 క్రాక్ కొకైన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జైల్లోని ఖైదీల కోసం పిల్లి ద్వారా మత్తు మందుల స్మగ్లింగ్ జరిగిందని కోస్టారికా న్యాయశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
‘చురుకైన అధికారుల అప్రమత్తతకు కృతజ్ఞతలు. పిల్లిని పట్టుకోగలిగారు. దాని వల్ల ఆ డ్రగ్స్ లక్ష్యాన్ని చేరుకోకుండా అడ్డుకున్నారు’ అని ఆ ప్రకటన పేర్కొంది. అధికారులు పిల్లిని ‘అరెస్ట్’ చేయగానే అది మౌనంగా ఉండిపోయింది. మత్తు మందు పాకెట్లను కత్తెరతో కట్ చేస్తున్నప్పుడు ఒళ్లు విరుచుకొని విశ్రాంతి తీసుకుంది. వైద్య పరీక్షలు, సంరక్షణ నిమిత్తం ఆ పిల్లిని జంతువుల ఆరోగ్య సేవల విభాగానికి అప్పగించారు.