Cargo Corridor | టోక్యో, నవంబర్ 10: ప్రపంచానికి బుల్లెట్ రైలును పరిచయం చేసిన జపాన్, మరో అద్భుత ఆవిష్కరణకు పూనుకుంది. రాజధాని టోక్యో నుంచి ఒసాకా వరకు 515 కిలోమీటర్ల (320 మైళ్లు) మేర సరికొత్త సరుకు రవాణా వ్యవస్థను జపాన్ తీసుకొస్తున్నది. ఇంతకు ముందు ఎక్కడా చూడనటువంటి రీతిలో ఓ ‘ఆటోమేటెడ్ కార్గో ట్రాన్స్పోర్ట్ కారిడార్’ (కన్వేయర్ బెల్ట్ రోడ్)ను నిర్మించబోతున్నది. సాంకేతికంగా ప్రపంచ దేశాలేవీ అందుకోలేనంత స్థాయిలో దీని నిర్మాణం ఉంటుందట! జపాన్ నిర్మిస్తున్న ఈ కారిడార్‌ను .. ఆటో ఫ్లో రోడ్‌గా కూడా పిలుస్తున్నారు. ఈ కారిడార్ ప్రతిరోజూ 25,000 ట్రక్ డ్రైవర్ల పనిని చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
కారిడార్ ఎందుకు?
ట్రక్ డ్రైవర్ల కొరతను అధిగమించటం, అత్యంత వేగవంతమైన సరుకు రవాణా వ్యవస్థను నెలకొల్పటం జపాన్ ఉద్దేశం. ఇందుకు సంబంధించి ట్రయల్ రన్ 2027 లేదా 2028 మొదట్లో చేపడుతున్నది. 2030 మధ్య నాటికి ఈ కారిడార్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నది. ‘కేవలం సరుకు రవాణా కోసం ఓ రోడ్డును ఏర్పాటుచేయటమే ‘ఆటో ఫ్లో రోడ్’ ఉద్దేశం. 24 గంటలపాటు అందుబాటులో ఉండే మానవ రహిత రవాణా వ్యవస్థ ఇది’ అని జపాన్ రవాణా, మౌలిక సదుపాయాల శాఖ సీనియర్ డిప్యూటీ డైరెక్టర్ యూరి తెలిపారు.
ఎలా పనిచేస్తుంది?
ఆటో ఫ్లో రోడ్డుపై మూడు వేర్వేరు మార్గాలుంటాయి. వీటిపై కార్గో ప్యాలెట్స్ (సరుకు మోసుకెళ్లే డ్రైవర్‌లెస్ వెహికల్స్) ప్రయాణిస్తాయి. రోబోటిక్స్‌తో ‘కార్గో ప్యాలెట్స్’ కాన్వాయ్‌ను నియంత్రిస్తారు. గమ్యస్థానం రాగానే కార్గో ప్యాలెట్స్లోని సరుకును పై నుంచి రోబోటిక్స్ లాగేస్తాయి. లోడింగ్, అన్లోడింగ్ సెకన్ల వ్యవధిలో జరిగిపోతుంది.