న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో నెలకొన్న పరిణామాలపై భారత్ స్పందించింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా ప్రకటించడంతో రెండు దేశాల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి దేశం తరఫున మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తలు మరింత పెరిగితే శాంతికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కాబట్టి సమస్యను దౌత్య మార్గంలో సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. అందుకు ఇరుపక్షాలు శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. దౌత్య మార్గంలో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ఇరుపక్షాలు వీలైనంత త్వరగా చర్యలు ప్రారంభించాలని కోరారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలను తగ్గించేందుకు ట్రైలేటరల్ కాంటాక్ట్ గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తిరుమూర్తి పేర్కొన్నారు. ట్రైలేటరల్ కాంటాక్ట్ గ్రూప్ ప్రయత్నాలు సజావుగా సాగాలంటే సైనిక ఘర్షణలు మరింత తీవ్రం కాకుండా చూడాలని అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా ఉక్రెయిన్లో భారత పౌరుల భద్రతపై కూడా టీఎస్ తిరుమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు. 20 వేల మందికిపైగా భారత విద్యార్థులు, పౌరులు ఉక్రెయిన్లో నివసిస్తున్నారని, వారి సంక్షేమమే తమ ప్రాధాన్యమని ఆయన చెప్పారు.